తాంసి : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కప్పర్ల గ్రామ శివారులో నడిరోడ్డుపై విద్యుత్ స్తంభం ( Electricity pole ) ఏర్పాటు చేయడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మధ్యలోనే ఏర్పాటు చేసిన స్తంభం కారణంగా రాత్రి సమయంలో ప్రమాదాలు సంభవిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. చీకటిలో స్తంభం స్పష్టంగా కనిపించక పోవడంతో వాహనాలకు ప్రమాదాలు ( Accidents ) జరుగుతున్నాయని వాపోయారు.
ఇప్పటికే ప్రమాదాలు సంభవించాయని, ఇది ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, రోడ్డు భద్రత ( Road Security ) దృష్ట్యా వీలైనంత త్వరగా స్తంభాన్ని పక్కకు తరలించాలని వాహనదారులు కోరుతున్నారు. రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.