ఓటరుగా నమోదు కావడానికి ఎన్నికల సంఘం(ఈసీ) మరో అవకాశం కల్పించింది. జనవరి 1, 2024 వరకు పద్దెనిమిదేండ్లు నిండిన యువతీయువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్, బీఎల్వోలకు ఫామ్-6 ఇచ్చి నూతన ఓటరు జాబితాలో పేరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దీనితోపాటు మార్పులు-చేర్పులు, సవరణలకు కూడా చాన్స్ ఇచ్చింది.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2024 పేరిట శ్రీకారం చుట్టగా.. ఈనెల 20వ తేదీ నుంచి కార్యక్రమం కొనసాగనుంది. శని, ఆదివారాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి.. ఫిబ్రవరి 8వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నారు. కాగా.. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారి కోసం యేడాదిలో నాలుగు సార్లు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. త్వరలో పార్లమెంట్‌తోపాటు పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనుండగా ఓటరు నమోదు చేసుకోవాలని పేర్కొంది.
– కోటపల్లి, డిసెంబర్ 11
కోటపల్లి, డిసెంబర్ 11 : జనవరి 1, 2024 వరకు పద్దెనిమిదేండ్లు నిండిన యువతీయువకులకు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ అవకాశాన్ని కల్పిస్తున్నది. అర్హత ఉన్నవారు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ లేదా బీఎల్వోకు ఫామ్-6 సమర్పించి నూతన ఓటరు జాబితాలో పేరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దీనితోపాటు ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు తప్పుగా ఉన్నవారు కూడా సవరణకు దరఖాస్తు ఇవ్వవచ్చని సూచించింది. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2024 పేరిట శ్రీకారం చుట్టగా.. ఈనెల 20వ తేదీ నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం కొనసాగనుంది. 2024 జనవరి 6న ఓటరు మసాయిదా జాబితాను విడుదల చేసి ఆ రోజు నుంచి 22వ తేదీ వరకు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. శని, ఆదివారాల్లో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించనున్నారు. 2024 ఫిబ్రవరి 2వ తేదీ వరకు అభ్యంతరాలపై వివరణలు ఇచ్చి అదే నెల 8న ఓటరు తుది జాబితాను ప్రకటించనున్నారు.
పార్లమెంట్‌తోపాటు పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు త్వరలో జరగనుండగా.. ఈ నూతన ఓటరు జాబితా కార్యక్రమంలో ఓటరుగా నమోదు చేసుకున్నట్లయితే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. కొందరు ఓటరు నమోదును పట్టించుకోకపోవడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయారు. వీరికి ఈ నూతన ఓటరు నమోదు మంచి అవకాశం కానుంది.
కాగా.. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా శని, ఆదివారాలు నూతన ఓటర్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉండనుంది. జనవరిలో కార్యక్రమం ఉండనుండగా, బూత్ లెవల్ పోలింగ్ అధికారులు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రత్యేక ఓటరు నమోదుకు దరఖాస్తుల స్వీకరణకు తేదీలను ఎన్నికల కమిషన్ అతి త్వరలోనే ప్రకటించనుంది.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించేందుకు ఎన్నికల కమిషన్ ప్రతి మూడు నెలలకోసారి ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తోంది. గతంలో ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలంటే డిసెంబర్ లేదా జనవరి నెలల్లో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అవకాశం ఉండేది.
దీనిద్వారా కొంత మంది ఓటు హక్కుకు దూరంగా ఉంటున్నారని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారి కోసం సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిద్వారా ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు అవకాశం లభిస్తోంది.