మంచిర్యాలటౌన్, నవంబర్ 9 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆండాళమ్మ కాలనీలో నిర్మించిన జంతు సంరక్షణ కేంద్రం నిర్వహణ గతితప్పింది. ఏజెన్సీతో పాటు మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ వీధికుక్కలు మృత్యువాత పడుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు 10కి పైగా చనిపోగా.. మరికొన్ని మృత్యువుకు దగ్గరలో ఉన్నాయి. కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేసేందుకు కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీ నిర్వాహకులు.. అందులో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు సరిగా ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సిబ్బంది సరిగా పనిచేయక పోవడం, విధులను పక్కన పెట్టడంలాంటి అంశాలు ఈ కేంద్రంలో చోటుచేసుకున్నాయి. దాదాపు మూడురోజుల పాటు కుక్కలకు ఆహారాన్ని అందించక పోవడం వల్లే కుక్కలు చనిపోయినట్లు తెలుస్తోంది.
జీతాలివ్వక.. విధుల బహిష్కరణ!
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని కుక్కలతో పాటు జిల్లాలోని మిగిలిన ఆరు మున్సిపాలిటీల్లో పట్టుకున్న వీధికుక్కలను జంతు సంరక్షణ కేంద్రానికి తరలించి.. అక్కడ ఆరు రోజుల పాటు ఉంచుతారు. మూడు రోజుల పాటు పరిశీలనలో ఉంచిన అనంతరం స్టెరిలైజేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసిన అనంతరం మరో మూడురోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచుతారు. ఈ ఆరురోజుల పాటు కుక్కలకు మూడుపూటలా ఆహారాన్ని ఏజెన్సీ నిర్వాహకులే అందించాల్సి ఉంటుంది. కుక్కలను పట్టుకోవడం, జంతు సంరక్షణ కేంద్రానికి తరలించడం, ఆపరేషన్లు చేయడం, గడువు పూర్తయ్యాక తీసుకువచ్చిన కుక్కలను తిరిగి వాటి స్థానాలకు తరలించడం వంటివి ఏజెన్సీ చూసుకోవాలి. ఇందుకోసం ఒక్కో కుక్కకు రూ. 1650 చొప్పున మున్సిపాలిటీలు చెల్లిస్తున్నాయి. కుక్కలను తరలించడానికి మాత్రం వాహనాలను మున్సిపాలిటీలు అయితే రోజుకి ఎన్ని కుక్కలు వస్తున్నాయి, ఎన్నింటిని తిరిగి వాటి పాత ప్రదేశాలకు తరలిస్తున్నారనే విషయాన్ని మాత్రం అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది.
మంచిర్యాలలోని జంతు సంరక్షణ కేంద్రాన్ని హైదరాబాద్‌కు చెందిన యానమల్ వెల్ఫేర్ సొసైటీ అనే సంస్థకు అప్పగించారు. ఇక్కడ ఎనిమిది మంది పనిచేస్తున్నారు. వీరికి ఏజెన్సీ జీతాలు ఇవ్వని కారణంగా మూకుమ్మడిగా విధులు బహిష్కరించినట్లు తెలుస్తోంది. కాగా వీధికుక్కల మృత్యువాతపై జంతు సంరక్షణ కేంద్రం వైద్యుడు డాక్టర్ సాయికళ్యాణ్ను సంప్రదించగా.. చనిపోయిన కుక్కలకు ఆపరేషన్ చేయలేదని, తీవ్రమైన చర్మవ్యాధులు, బలహీనమైన కుక్కలను తీసుకువచ్చారని, వాటికి ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పామన్నారు. కుక్కలను పట్టి తీసుకువచ్చే క్రమంలోనే అవి చివరిదశలో ఉన్నట్లు కనిపించాయని అన్నారు. ఆహారం లేని కారణంగా కుక్కలు చనిపోయాయని వస్తున్న దానిలో వాస్తవం లేదని, తాను కేంద్రాన్ని పరిశీలించిన సమయంలో కుక్కలకు ఆహారం అందుబాటులో ఉన్నదని మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ తెలిపారు.
కావాలనే బురదజల్లే ప్రయత్నం
– శ్రీనివాస్, యానిమల్ వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు
జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకువచ్చిన కుక్కలు కేవలం అనారోగ్యంతోనే చనిపోయాయి. ఆహారం లేకుండా చనిపోయాయి అనడంలో వాస్తవం లేదు. కేంద్రంలో ఇంకా 25 కుక్కలు ఉన్నాయి. అవి ఆరోగ్యంగానే ఉన్నాయి. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా కాంపౌండర్‌కు పని సరిగా రాకపోవడంతొ విధులనుంచి తొలగించాం. ఆమె పనిచేసిన కాలానికి జీతం కూడా అందజేశాం. ఆమెను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ మరో ఇద్దరు సిబ్బంది విధులకు రావడం లేదు. దీంతో వారికి జీతం ఆపేశాము. నిబంధనల ప్రకారం ఎవరైనా ఉద్యోగి సంస్థనుంచి వెళ్లిపోవాలంటే రెండు నెలల ముందు చెప్పాలి. కానీ ఇక్కడ కాంపౌండర్‌ను తీసేశారన్న కారణంతో ఇద్దరు విధులకు రావడం లేదు. దీంతో వారికి జీతం ఇవ్వలేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని కుట్రతో కుక్కలు మృత్య్యువాత అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచనలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటాం.