నమస్తే నెట్వర్క్, మే 6 : అకాల వర్షం అన్నదాతలకు కన్నీరే మిగిల్చింది. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పలు మండలాల్లో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షార్పణమైంది. ధాన్యాన్ని తడవకుండా కాపాడుకునేందుకు అన్నదాతలు అరిగోస పడ్డారు. కళ్లముందే చేతికి అందిన పంట వరదలో కొట్టుపోతుండడం, కోత దశలో ఉన్న చేలు నేలకొరిగిన దృశ్యాలు చూసి కర్షకులు కన్నీరు పెట్టుకున్నారు. ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం, అధికారులు వేగవంతం చేయకపోవడంతోనే తమకు ఈ దుస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు గాలివాన బీభత్సంతో భారీ వృక్షాలు కూలి రోడ్లపై పడ్డాయి. విద్యుత్ తీగలపై చెట్లకొమ్మలు విరిగి పడడంతో స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరాలో రెండు మూడు గంటల పాటు అంతరాయం కలిగింది. పలు ఇండ్ల గోడలు కూలడంతో పాటు ఇండ్లపైకప్పు రేకులు ఎగిరిపోయాయి.
దండేపల్లి మండలంలో పలు కొనుగోలు కేంద్రాల్లో తూకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసిసోయింది. నర్సాపూర్‌లో ఇంటిపై కప్పు రేకులు ఎగిరిపోయాయి. హాజీపూర్ మండలంలో నంనూర్, సబ్బేపల్లిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. నిర్వాహకులు టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో ధాన్యం తడిచిందని రైతులు వాపోయారు. నెన్నెల మండలకేంద్రంతో పాటు గొల్లపల్లి, జోగాపూర్, ఆవుడం, చిత్తాపూర్, నెన్నెల, మన్నెగూడెం గ్రామాల్లో కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. నిలిచిన నీటి తొలగించేందుకు రైతులు తిప్పలు పడ్డారు. మామిడి తోటల్లో కాయలు నేల రాలి రైతులను నష్ట పరిచింది.

చెన్నూర్ మండలంలో కిష్టంపేట, ఆస్నాద్, కొమ్మెర, చింతలపల్లి, నాగాపూర్, సోమన్‌పల్లి, బీరెల్లి, పొక్కూర్, నాగాపూర్‌లోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిశాయి. జైపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. బస్తాకు 43కిలోల ధాన్యాన్ని నింపకపోతే రైస్‌మిల్లర్లు దించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. ఈ సమస్యపై టేకుమట్ల కొనుగోలు కేంద్రానికి వచ్చిన జిల్లా అదనపు కలెక్టర్ రాములుకు రైతులు విన్నవించారు. మిలర్లతో మాట్లాడుతామని ఆయన తెలిపారు. రామారావుపేటలోని సుముఖ ఇండస్ట్రీస్‌లో 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిలువ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కోటపల్లి మండల కేంద్రంలో మార్కెట్ యార్డు గోదాంల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసింది.
భీమారం మండల కేంద్రంతో పాటు కొత్తపల్లి, ఆరెపల్లి, దాంపూర్, ఖాజీపల్లి, బూరుగుపల్లి గ్రామాల్లో వడ్లు తడవడంతో పాటు మామిడి కాయలు నేలరాలాయి. కాసిపేట మండలంలో కొనుగోలు కేంద్రాలు, పొలాల్లోని కల్లాల్లో వడ్ల కుప్పలు తడిచాయి. మంచిర్యాలలోని సాయికుంట ఏరియాలో ప్రభుత్వ బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ గేటు సమీపంలో, ప్రహరీపై చెట్లు విరిగిపడ్డాయి. 11వ డివిజన్ గోదరివాడ మల్లన్న గుడి సమీపంలో చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. మందమర్రి మండల పరిధిలోని బొక్కలగుట్ట, సారంగపల్లి, పొన్నారం, గుడిపెల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. కన్నెపల్లి మండలంలో లింగాల గ్రామంలో పలు ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరి విద్యుత్ తీగలపై పడ్డాయి. చెట్లు, స్తంభాలు విరిగాయి.
కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసి ముద్దయ్యాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్ పేట్ మండలంలోని ఎలపల్లిలో పిడుగు పడి జరుపుల శ్యామ్‌కు చెందిన రెండెకరాలకు సంబంధించిన వరి కుప్ప దగ్ధమైంది. బుధవారం ఉదయం ఆర్ఐ రాజేశ్వర్ జీపీవో అనిల్ ఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా చేశారు. రూ. 60 వేల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వ ఆదుకోవాలని రైతు కోరాడు. దహెగాం మండల కేంద్రంతో పాటు లగ్గాం, ఒడ్డుగూడ, ఖర్జీ, గిరివెల్లి, చంద్రపల్లి, కొంచవెల్లి, హత్తిని, పీపీరావు కాలనీ గ్రామాల్లోని ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి 20 రోజులైనా వడ్లు కొనకపోవడంతో చేతికి అందిన పంట తడిసిపోయిందని, కొబ్బరికాయలు కొట్టి సెంటర్లు ప్రారంభించిన అధికార పార్టీ నాయకులు కొనుగోళ్లను ఎందుకు పట్టించుకోవడం లేదని రెండు జిల్లాల్లోని రైతులు మండిపడుతున్నారు.
