నిర్మల్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): తాగునీటి సమస్య పరిష్కారానికి నిర్మల్ జిల్లాలో చేపట్టిన అమృత్ పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద నిధులు మంజూరు చేసిం ది. ఇందులో భాగంగా జిల్లాలో నిర్మల్ మున్సిపాలిటీకి రూ.62 కోట్లు, ఖానాపూర్ మున్సిపాలిటీకి రూ.22 కోట్లు కేటాయించారు. తాగునీటి పథకాలకు టెండర్ల ప్రక్రియ పూర్తయి ఏడాదైనా పనులకు మాత్రం మోక్షం లభించడం లేదు. ఖానాపూర్‌లో పనులు ప్రారంభమైనప్పటికీ నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలు ఉ న్నాయి. ఖానాపూర్లోని గాంధీనగర్ వద్ద రిజర్వాయర్ నిర్మాణంతో పాటు, అన్ని కాలనీలకు తాగునీరందేలా కొత్తగా పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండగా, ఇటీవలే జేకే నగ ర్ కాలనీలో మాత్రమే ప్రారంభించారు. నిర్మ ల్ మున్సిపాలిటీలో టెండరు ప్రక్రియ పూర్తయినా ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందు కు పడలేదు.
కేవలం అక్కడక్కడ పైపులను మాత్రం వేశారు. ఈ పథకం కింద ఎస్సారెస్పీ సమీపంలోని గాంధీనగర్ పంప్ హౌస్ నుంచి నిర్మల్ పట్టణ శివారులోని సిద్ధాపూర్ ఫిల్టర్ బెడ్స్ వరకు, పట్టణంలోని పలు పాత రిజర్వాయర్లకు మంచి నీటిని తరలించేలా కొత్తగా పైప్లైన్లను వేయాల్సి ఉన్నది. జిల్లా కేంద్రంలో 20 ఏళ్ల క్రితం వేసిన పాత పైప్‌లైన్ చెడిపోవడంతో తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. దీంతో ఈ పైప్‌లైన్‌కు సమాంతరంగా దాదాపు 15 కిలోమీటర్ల మేర కొత్తగా పైప్‌లైన్ వేసి పట్టణంలోని ఇసురాళ్ల గుట్ట వద్దగల సంప్ వరకు లింక్ చేయాల్సి ఉంది. పాలిటెక్నిక్ కళాశాల స మీపంలో, సోఫీనగర్, ఆదర్శనగర్ కాలనీల్లో మూడు చోట్ల కొత్తగా ఈఎల్ఎస్ఆర్ (ఓవర్ హెడ్ రిజర్వాయర్)ను నిర్మించాలి. ఇందుకో సం రూ.62 కోట్లను కేటాయించారు. అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయం లేక ప నులు ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు రాజకీయ ఒత్తిళ్లు కూడా ఒక కారణంగా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న ఈ పనులను ప్రారంభించేందుకు స్థానిక ఎమ్మెల్యే సమ యం ఇవ్వకపోవడంతోనే పనులు మొదలు కావడం లేదని తెలుస్తున్నది.
వచ్చే వేసవి నాటికి నీరందేనా…?
నిర్మల్ పట్టణం జిల్లా కేంద్రంగా మారిన నాటి నుంచి పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నది. విద్య, వైద్యం, ఇతర ఉపాధి అవకాశాల కో సం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అనేక మంది పట్టణానికి వచ్చి స్థిర నివాసం ఏర్పా టు చేసుకుంటున్నారు. దీంతో కొత్త కాలనీలు ఏర్పాటవుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతు న్న తాగునీటి పథకంతో పాత కాలనీలకే ము న్సిపాలిటీ ద్వారా తాగునీటిని అందించే అవకాశం ఉన్నది. గత కేసీఆర్ ప్రభుత్వంలో మిష న్ భగీరథ పథకం కింద కొన్ని కాలనీలకు కొత్త గా పైప్లైన్లను వేయడంతో పాటు కొత్తగా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను నిర్మించారు. కొత్తగా అమృత్-2 కింద ప్రతిపాదించిన రిజర్వాయర్లతో మరిన్ని కొత్త కాలనీలకు తాగునీరందే అవకాశం ఉన్నది.
టెండర్లు దక్కించుకున్న సంస్థ ఇప్పటి వరకు పనులను మొదలు పెట్టలేదు. వేసవి నాటికి పనులు పూర్తవుతాయా..? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న తాగునీటి వ్యవస్థతో ప్రతి సంవత్సరం వేసవిలో రోజు విడిచి రోజు నీటిని అందించే పరిస్థితి ఉన్నది. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అమృత్-2 పనులు సకాలంలో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకొని పనులు జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ప్రజారోగ్య శాఖ ఏఈ శ్రీనివాస్‌ను వివరణ కోరగా, త్వరలోనే స్థానిక ఎమ్మెల్యే సమయం ఇస్తామన్నారని, ఇవ్వగానే పనులను ప్రారంభిస్తామని తెలిపారు.