చెన్నూర్ రూరల్, ఆగస్టు 6: చెన్నూర్ మండలంలోని కొమ్మెర గ్రామంలో ఉన్న జడ్పీ హైస్కూల్లో నీటి గోస తో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మ ధ్యా హ్నం భోజనం చేసేందుకైనా నీళ్లు లేక తిప్పలు పడుతున్నా రు. టాయిలెట్లు, మరుగుదొడ్ల వద్ద నీళ్లు లేక ఇం టికి వెళ్లాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ వరకూ ఫిర్యాదు చేసినా తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని విద్యార్థులు తెలిపారు.
ఈ పాఠశాలలో 53 మంది విద్యార్థులున్నారు. గత జనవరిలో బోరు మోటరు నుంచి విద్యుత్ మోటర్ చెడిపోయింది. అప్పటి నుంచి అధికారులకు విద్యార్థులు ఎన్నిసార్లు విన్నవించినా మరమ్మతులు చేయించలేదు. 8 నెలలుగా తాగునీరు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇంటి నుంచి వాటర్ బాటిళ్లలో తాగునీటిని తెచ్చుకుంటున్నారు.
మధ్యాహ్న భోజనం తినేముందు చేతులతో పాటు ప్లేట్లను శుభ్రం చేసుకునేందుకు తిన్న తర్వాత కడిగేందుకు నీళ్లు లేక తిప్పలు పడుతున్నారు. దీంతో పాఠశాలకు 200 మీటర్ల దూరంలో ఉన్న కాలనీలోని బోర్వెల్ వద్దకు వెళ్తున్నారు. అక్కడే నీళ్లు తాగి చేతులు, ప్లేట్లను కడుగుతున్నారు. ఆ సమయంలో కరెంటు లేకపోతే మరింత ఇబ్బంది పడుతున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లకు వెళ్లేందుకు నీళ్లు లేవు. ముఖ్యంగా విద్యార్థినులు, ఉపాధ్యాయినులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. టాయిలెట్‌కు వెళ్లాలంటే పాఠశాల నుంచి ఇంటికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నది.
ఇంటి వద్దే మధ్యాహ్న భోజనం వంట..
మధ్యాహ్న భోజనం వంట వండేందుకు పాత్రలను కడిగేందుకు నీళ్లు లేకపోవడంతో ఇంటి వద్దే మధ్యాహ్న భోజన కార్మికురాలు వండుతున్నది. ఇంటి వద్ద వండిన తర్వాత భోజనాన్ని ఇంటి నుంచి పాఠశాలలకు తీసుకెళ్లడం, విద్యార్థులకు వడ్డించిన తర్వాత పాత్రలను ఇంటికి మోసుకెళ్లి కడగాల్సి వస్తుందని కార్మికురాలు తెలిపింది.
విద్యార్థులపై ఇంత నిర్లక్ష్యమా..?
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తాగునీటి వసతి కల్పించడంలో నిర్లక్ష్యం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం పాఠశాల బయటికి వచ్చి కాలనీలోని బోరు వద్దకు వస్తున్నారని, వారికి ఏవైనా ప్రమాదాలు జరిగితే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని పాఠశాలలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
స్పెషల్ ఆఫీసర్‌కు విద్యార్థుల వేడుకోలు
పాఠశాలలో కొన్ని నెలలుగా నెలకొన్న తాగునీటి సమస్యను కొమ్మెర గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ( స్థానిక తహసీల్దార్) మల్లికార్జున్‌కు విద్యార్థులు వివరించారు. టాయిలెట్ల, మరుగుదొడ్ల పరిస్థితులపై వినతి పత్రాన్ని అందించారు. ఈ సమస్యపై పాఠశాల హెచ్ఎంను వివరణ కోరగా ఆయన ఎలాంటి సమాధానం చెప్పలేదు.
మరుగుదొడ్లు లేవు..ఇంటికి పోతున్నాం..
పాఠశాలలో మరుగుదొడ్లకు వెళ్లేందుకు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. టాయిలెట్ల నుంచి దుర్వాసన వస్తున్నది. మధ్యాహ్న సమయంలో విద్యార్థులకు బహిర్భూమికి వస్తే ఇంటికి వెళ్లి వస్తున్నారు, పాఠశాలలో నీళ్లు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. మా బాధలను అర్థం చేసుకొని పాఠశాలలో తాగునీటి సమస్యను పరిష్కరించాలి.
– అభినయశ్రీ, 7వ తరగతి విద్యార్థిని
తాగునీటి సమస్య పరిష్కరిస్తాం..
కొమ్మెర హైస్కూల్లో కొన్ని నెలలుగా తాగునీటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని తెలుపుతూ విద్యార్థులు వినతి పత్రాన్ని అందించారు. వెంటనే ఈ విషయంపై మిషన్ భగీరథ ఏఈ సరితతో మాట్లాడాను. తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరడం జరిగింది. త్వరలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం.
-మల్లికార్జున్, స్పెషల్ ఆఫీసర్, కొమ్మెర గ్రామ పంచాయతీ
తాగునీటి కష్టాలు తీర్చాలి..
మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం సమయంలో చేతులు, భోజనం చేసే ప్లేట్ కడిగేందుకు భోజనం తర్వాత తిన్న ప్లేట్లు చేతులు శుభ్రం చేసుకునేందుకు నీళ్లు లేవు. పాఠశాల పక్కన వేరే వాళ్లు ఇండ్లకు తాగునీళ్లకోసం వేసుకున్న బోరు వద్దకు వెళ్తున్నాం. ఆ సమయంలో కరెంట్ లేకుంటే తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా నీళ్ల కష్టాలను తీర్చాలని కోరుకుంటున్నాం.
– రోహిత్, 10వ తరగతి విద్యార్థి