పై ఫొటోలో తమ పట్టాలను చూపిస్తున్న రైతులు కుమ్రం భీం ఆసిఫాబాద్ బెజ్జూర్ మండలంలోని లుంబినగర్ చెందినవారు. ఈ గ్రామంలో 69 మంది రైతులు ఉన్నారు. వీరిలో 32 మంది రైతులకు 2010 లో 120 ఎకరాలకు అప్పటి ప్రభుత్వం పట్టాలను జారీచేసింది. ఈ పట్టాల ఆధారంగా రైతులు బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందారు. 2015లో వీరి భూముల్లో ప్రభుత్వం 9 బోర్లను కూడా మంజూరు చేసి రైతులకు సామూహికంగా సాగునీరు అందించడంతో పంటలను సాగుచేసుకుంటున్నారు. అయితే ఈ భూములను సాగు చేయవద్దని, చేలల్లోకి వెళ్తే కేసులు పెడుతామని హెచ్చరిస్తూ అటవీ అధికారులు ఇటీవల నోటీసులు జారీచేశారు. దున్నేందుకు వెళ్లిన ట్రాక్టర్ల యజమానులకు సైతం నోటీసులు అధికారులు పంపించారని అన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో అటవీ ప్రాంత గ్రామాల్లో పట్టా భూములున్న రైతులకు కూడా సాగుచేయవద్దంటూ అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. దాదాపు 40 ఏండ్ల నుంచి సాగులో ఉండి సుమారు 15 ఏళ్ల క్రితమే పట్టాలు పొందిన రైతులకు సైతం అటవీ అధికారులు నోటీసులు జారీచేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బెజ్జూర్ మండలంలోని లుంబినినగర్లో 32 మంది రైతులకు వారి సాగులో ఉన్న భూములకు 2012లో ప్రభుత్వం పట్టాలను జారీ చేసింది. వర్షాకాలం సాగుకు భూములను సిద్ధం చేసేందుకు పత్తి కట్టె తీసేందుకు వెళ్లిన 32 మంది రైతులకు ఇటీవల నోటీసులు జారీచేశారు. దున్నేందుకు వెళ్లి న ట్రాక్టర్ల యజమానులకు కూడా నోటీసులు అందజేశారు. ట్రాక్టర్లను సీజ్ చేస్తామని, వ్యవసాయ పనులు చేసే రైతులపై కేసులు పెడుతామని హెచ్చరికలు జారీ చేశారు. 40 ఏళ్లుగా సాగులో ఉన్న తమ భూములను అటవీ అధికారులు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఇండ్లలో సైతం బోర్లు వేయనీయడం లేదు
బెజ్జూర్ మండలంలోని పాపన్నపేటలో సుమారు 500 ఇండ్లు ఉన్నాయి. ఈ గ్రామంలో తాగునీటి అవసరాలకు సైతం ఇళ్లలో బోర్లు వేసుకోకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు. బోర్లు వేయరాదని డప్పుచాటింపులు సైతం చేశారని, సమావేశాలు నిర్వహించి హెచ్చరించారని గ్రామస్తులు తెలిపారు. అటవీ అధికారులు తమకు తాగేందుకు కూడా నీళ్లులేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్లకు ముందు ఏర్పడిన ఈ గ్రామాన్ని ఖాళీ చేయించాలని చూస్తున్నారని వాపోయారు. ఈ విషయంపై కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్‌కుమార్ టిబ్రెవాల్ను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా అటవీ శాఖ నుంచి నోటీసులు జారీ చేసిన విషయం తన దృష్టికి రాలేదని, ఈ సమస్యపై రైతులు, గ్రామస్తులు కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. వారు దృష్టికి తీసుకువస్తే పరిశీలిస్తానని ఆయన తెలిపారు.
చేలల్లో పనులు చేయవద్దని నోటీసులిచ్చిండ్రు..
మేము 40 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూముల్లో సాగు నిలిపివేయాలని అటవీ అధికారులు నోటీసులిచ్చారు. మా గ్రామంలో 32 మంది రైతులకు 2012 అప్పటి ప్రభుత్వం 120 ఎకరాలకు పట్టాలు ఇచ్చింది. మా భూముల్లో సాగునీటి కోసం 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం బోర్లను కూడా వేయడంతో పంటలను సాగుచేసుకుంటున్నాం. అయితే ఇటీవల మా చేలలోనికి పనులకు వెళ్లకూడదని, వర్షాకాలానికి భూములను సిద్ధం చేయవద్దని అధికారులు నోటీసులిచ్చారు. చేలలోకి వెళ్తే కేసులు పెడుతామని అంటున్నారు.
– వగాడి బురుజ, రైతు, లుంబినగర్