ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 8: దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని డీఆర్డీవో కిషన్ పేర్కొన్నారు. మండలంలోని కేస్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కేస్లాగూడ(ఎం), దస్నాపూర్ గ్రామాలను మంగళవారం ఆయన సందర్శించారు. దళితులకు దళిత బంధుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో దళితులను ఎంపిక చేసి రూ.10 లక్షలు అందజేస్తామని చెప్పారు. ఈ రుణాలతో వివిధ వ్యాపారాలు చేసుకోవాలన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, కలెక్టర్ గ్రామాల ఎంపిక కోసం కృషి చేశారని తెలిపారు. దళిత బంధు పథకంలో ఎంపికైన లబ్ధిదారులు బ్యాంకులో కొత్తఖాతా తీయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి, ఎంపీడీవో పుష్పలత, ఈసీ జాదవ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో అన్ని రకాల మొక్కలు పెంచాలని డీఆర్డీవో కిషన్ అధికారులకు సూచించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కోరుకునే మొక్కలు అందించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో పుష్పలత, ఈసీ శ్రీనివాస్, టీఏ జాదవ్ విఠల్ ఉన్నారు.