మంచిర్యాల అర్బన్, జనవరి 1 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన వైద్యులు, సిబ్బందితో పాటు ఇతరులు ద్విచక్ర వాహనాలతో పాటు ఫోర్ వీలర్లను ఎక్కడపడితే అక్కడ అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యం వేలాది మంది రోగులు, వారి బంధువులు ఆటోలు.. ఇతర వాహనాల్లో ఇక్కడికి వస్తుంటారు. వైద్య సిబ్బందితో పాటు రోగులు, వారి బంధువులు, అలాగే సుదూర ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు సైతం ఇదే దవాఖాన ఆవరణలో పార్కింగ్ చేయడం వల్ల తిప్పలు తప్పడం లేదు. కొన్నిసార్లు వాహనాలు నిలిపి లోపలికి వెళ్లిన వారు తిరిగి వచ్చే వరకూ నిరీక్షించాల్సి వస్తున్నది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లకూ దారి దొరకని దుస్థితి నెలకొంటున్నది.
అందుబాటులో లేని సిబ్బంది
అంబులెన్స్‌లో వచ్చే పేషెంట్లను దవాఖాన లోపలికి తీసుకెళ్లడానికి షేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో ఉండాలి. కానీ, ఇక్కడ ఎవరూ అందుబాటులో ఉండడం లేదని తెలుస్తున్నది. 108 అంబులెన్స్ సిబ్బందే స్ట్రెచర్ మీదనో లేక వీల్ చైర్లోనో రోగులను దవాఖానకు చేర్చుతున్నారు. కాగా, ఈ విషయమై అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అంబులెన్స్ వేచి ఉన్నా..
ఓ ఎమర్జెన్సీ కేసును బెల్లంపల్లికి చెందిన 108 అంబులెన్స్ సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చారు. ఆ సమయంలో మెయిన్ గేటుకు అడ్డంగా దవాఖాన సిబ్బంది కారు నిలిపి ఉంది. కుయ్.. కుయ్.. అంటూ 3 నుంచి 5 నిమిషాల పాటు అక్కడే వేచి ఉన్నా.. ఆ వాహనాన్ని తీయలేదు. దీం తో చేసేదేమీ లేక 108 సిబ్బందే వీల్ చెయిర్ తీసుకొని రోగిని దవాఖానలోకి తీసుకెళ్లారు. ఇదంతా జరిగిన తర్వాత సంబంధిత కారు డ్రైవర్ వచ్చి దానిని తీస్తున్న క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది.