మంచిర్యాల, స్టాఫ్ఫొటోగ్రాఫర్ : లక్షెట్టిపేట మండలం వెంకట్రావ్పేట్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యుడు, సిబ్బంది ఎవరూ సమయానికి రావడం లేదు. ఈ మేరకు గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో గురువారం వెంకట్రావ్పేట్ పీహెచ్సీని ‘నమస్తే తెలంగాణ’ సందర్శించింది. ఈ క్రమంలో ఉదయం 9 గంటలకు విధులకు రావాల్సిన వైద్యుడు ఉదయం 10.30 గంటలైనా రాలేదు. చూసీచూసి వైద్యుడి కుర్చీ ఖాళీగా ఉన్న ఫొటోలు తీసుకోగానే.. అక్కడున్న సిబ్బంది వెంటనే డాక్టర్ సార్కు ఫోన్ చేశారు.
డాక్టర్ గుళ్లకోట గ్రామానికి సర్వేకు వెళ్లారని చెప్పారు. అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు డాక్టర్ను కలిసేందుకు గుళ్లకోటకు వెళ్తే.. అక్కడా సార్ దొరకలేదు. వాస్తవానికి సార్ అసలు డ్యూటీకి వచ్చారా లేదా.. అని డీఎంహెచ్వో కార్యాలయంలో ఆరా తీయగా.. డాక్టర్లు వెళ్లి పాల్గొనే సర్వేలు ప్రస్తుతం జిల్లాలో చేయడం లేదన్నారు.
కుష్ఠువ్యాధికి సంబంధించిన సర్వే ఏఎన్ఎంలు చేస్తున్నారని.. ఆ సర్వేలకు డాక్టర్లు వెళ్లాల్సిన పని లేదని చెప్పారు. దీంతో డాక్టర్ సమయానికి రాకుండా సాకులు చెప్పారనే విషయం స్పష్టమైంది. సమయానికి విధులకు రాకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యుడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు.