మంచిర్యాలటౌన్, జనవరి 18 : ‘పట్టణాన్ని ఆనుకొని ఉన్న గోదావరి నుంచి ఈ 20 రోజుల్లో 800 లారీలకుపైగా ఇసుక, మట్టిని తరలించుకుపోయారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇసుక తోడుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. అసలు మంచిర్యాలలో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నట్టా.. లేనట్టా..? ఈ తతంగమంతా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కనుసన్నల్లోనే జరుగుతుంది. ఇసుక, మట్టి తరలింపు ద్వారా వచ్చిన డబ్బంతా ఆయన జేబులోకి వెళ్తున్నది.” అంటూ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక గోదావరి తీరాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.
12 అడుగులకు పైగా లోతుకు తవ్వగా, ఆ గుంతలను మీడియాకు చూపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. మంచిర్యాల వద్ద పవిత్ర గోదావరి నదీ తీరాన సమ్మక్క, సారలమ్మ గద్దెలు కొలువై ఉన్నాయని, జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు గుడారాలు వేసుకుని ఉంటారని, అలాగే శివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరని ప్రశ్నించారు. గోదావరిలో 20 రోజులుగా జేసీబీతో నిత్యం పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు చేపడుతున్నా యంత్రాంగం పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వమే ఇసుక మాఫీయా, మట్టి మాఫియాను ప్రోత్సహిస్తున్నదంటూ ప్రజలంతా మాట్లాడుకుం టున్నారని, అది ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నదన్నారు. ఇక్కడ తవ్విన ఇసుక, మట్టి ఎక్కడికి పోతున్నదని, జిల్లా అధికారులు, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకే 800 పైబడి లారీల్లో ఇసుక, మట్టిని తరలించారని, తప్పు చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఎక్కడైనా సొంత అవసరాలకోసం ఇసుక, మట్టి తీస్తే జరిమానాలు, కేసులు పెట్టే రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు ఇంత పెద్ద తతంగం జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, గోగుల రవీందర్‌రెడ్డి, అక్కూరి సుబ్బయ్య, ఎడ్ల శంకర్, తోట తిరుపతి, పడాల రవీందర్, షఫియొద్దీన్, తదితరులు పాల్గొన్నారు.