జిల్లాలోని సర్కారు దవాఖానలకు ‘సమస్యల’ జబ్బు పట్టుకున్నది. సౌకర్యాల లేమి.. సిబ్బంది కొరతతో రోగులు అవస్థలు పడాల్సి వస్తున్నది. సరిపడా బెడ్లు లేక.. ఒకేమంచంపై ఇద్దరికి సేవ లందించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇక మందులు అందుబాటులో లేక బయట కొన్కుక్కో వాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్రస్తుతం విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో సోమవారం ‘నమస్తే తెలంగాణ’ పలు హాస్పిటళ్లను విజిట్ చేయగా, అనేక విషయాలు వెలుగుచూశాయి.
మంచిర్యాల ప్రతినిధి/నమస్తే న్యూస్ నెట్వర్క్ : మంచిర్యాల జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జన్నారం, నెన్నెల, లక్షెట్టిపేట, చెన్నూర్ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో వందలాది మంది మంచం పట్టినట్లు తెలుస్తున్నది. పల్లెల్లో వైద్య సదుపాయాలు లేక చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, లక్షెట్టిపేటలోని ప్రభుత్వ దవాఖాలనకు రోగులు పరుగులు పెట్టాల్సి వస్తున్నది. జ్వర బాధితుల పరిస్థితిని బట్టి పెద్ద దవాఖానలకు రెఫర్ చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
ఒకే బెడ్‌పై ఇద్దరికి వైద్యం
మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో సరిపడా పడకలు లేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఒకే బెడ్‌పై ఇద్దరిని పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. ఇక్కడ రోజూ ఓపీ 900 పైచిలుకు ఉంటున్నా.. కనీస సదుపాయాలు కల్పించడంతో వైద్యులు విఫలం అవుతున్నారు. ఇక్కడ ఆరోగ్యశ్రీ వార్డు ప్రస్తుతం ఖాళీగానే ఉంది. అందులో ఏసీలు సైతం ఉన్నాయి. బెడ్లు కూడా ఉన్నాయి. కానీ అది ఎందుకు ఖాళీగా ఉంచారన్నది అర్థం కావడం లేదు. ఒక వార్డు మొత్తాన్ని ఖాళీగా ఉంచి వరండాల్లో మడత మంచాలు వేసి వైద్యం అందిస్తుండడం విడ్డూరంగా అనిపించింది.
సెంట్రల్ డ్రగ్ స్టోర్ (సీడీసీ) ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉండడంతో మందుల కొరత ఏర్పడుతున్నది. మందులు లేక బయటకు వెళ్లి తెచ్చుకోమని వైద్య సిబ్బంది చెబుతున్నట్లు రోగులు అంటున్నారు. చిన్న పిల్లల వార్డులోని ఒక రూమ్‌లో ఫ్యాన్ పనిచేయకపోవడంతో ఇంటి నుంచి ఫ్యాన్ తెచ్చుకొని వాడుతున్నారు. మొన్నటికి మొన్న ‘నమస్తే’ కథనంతో కలెక్టర్ వచ్చి దవాఖానను పరిశీలించినా.. పనితీరు ఏ మాత్రం మారినట్లు కనిపించలేదు. మూత్ర పరీక్షల కోసం శాంపిళ్లు తీసుకు రావడానికి రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బాత్రూమ్లు పనిచేయక చేతిలో డబ్బాలు పట్టుకొని బయటకి వెళ్తున్నారు.
56వేల జనాభాకు ఒక్కరే డాక్టర్..
జన్నారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అరకొర వసతులతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లో 56 వేల జనాభాకు ఒకటే దవాఖాన, ఒక్కరే వైద్యుడు ఉన్నాడు. ఇక్కడ కేవలం 6 బెడ్లు మాత్రమే ఉన్నాయి. ఒక్క బెడ్‌పై ఇద్దరు రోగులకు వైద్యం అందిస్తున్నారు. ప్రతి రోజూ 120 నుంచి 150 ఓపీ వస్తుందని వైద్యాధికారి గంగాభవాణి తెలిపారు. ఎలర్జి, వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు, విరోచనాలు, కోతులు, కుక్కల కాటుకు గురైనవారు ఎక్కవగా వస్తున్నారు.
23 పడకలు సరిపోవడం లేదు..
లక్షెట్టిపేట ప్రభుత్వ దవాఖానలో రోజుకు 100 నుంచి 150 మంది పేషెంట్లు వస్తున్నారు. వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సైతం రోజు 100 దాకా ఓపీ చూస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ సతీశ్ తెలిపారు. జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరగుతుండడంతో బెడ్లు సరిపోవడం లేదు. లక్షెట్టిపేటలో 30 పడకల ప్రభుత్వ దవాఖాన ఉంటే, ఇందులో కేవలం 23 బెడ్లు మాత్రమే ఉన్నాయి. తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ రోజూ 10 నుంచి 15 మంది ఇక్కడ చేరుతున్నారు. దీంతో రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఇది తాత్కాలిక భవనం కావడంతో అదనపు బెడ్లు వేయడం కష్టంగా మారిందని వైద్యులు అంటున్నారు. ఇదిలా ఉండగా లీవో సిట్రజిన్, ఆంటీబెటిక్ ట్యాబ్లెట్స్, స్లైన్స్ కావాల్సిన మేరకు అందుబాటులో లేవని తెలిసింది.
ఆవుడంలో ఒకరికి డెంగ్యూ పాజిటివ్
నెన్నెల మండలం ఆవుడం గ్రామస్తులు రెండు వారాలుగా జ్వరాలతో బాధపడుతున్నారు. ఇక్కడ ఓ వ్యక్తికి డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. దీంతో మిగిలిన జ్వర పీడితులు తమకు వచ్చింది సాధారణ జ్వరమా లేక డెంగ్యూనా అని ఆందోళన చెందుతున్నారు. ఘన్పూర్ గ్రామంలో జ్వర పీడితులు ఎక్కువగా ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. నెన్నెల, నందులపల్లి, జంగాల్‌పేట గ్రామాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. నెన్నెల కేబీజీఎస్లో విద్యార్థులకు జ్వరాలు రావడంతో ప్రత్యేక వైద్య బృందం వచ్చి సేవలందిస్తున్నది.
జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులను ఇండ్లకు పంపిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. జ్వరాలు వచ్చే వారిలో ఎక్కువ మందికి ప్లేట్లేట్స్ తగ్గుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నెన్నెల ఆరోగ్య కేంద్రంలో రెండు నెలలుగా ల్యాబ్ టెక్నీషియన్ లేక టెస్టులు జరగడం లేదు. గతంలో ఉన్న ఎల్టీ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో కొత్తవారు రాలేదు. దీంతో పీహెచ్‌సీకి వచ్చే రోగులకు రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు చేయడానికి వీలులేకుండా పోయింది. కేవలం జ్వరానికి ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నారు తప్పితే టెస్టులు చేయడం లేదు. ఈ కారణంగా చాలా మంది వైద్య పరీక్షల కోసం పట్టణాలకు వెళ్లి రక్త,మూత్ర పరీక్షలు చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. విష జ్వరాలు విజృంభిస్తున్న సమయంలో ల్యాబ్ టెక్నీషియన్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని రోగులు అంటున్నారు.
దవాఖానలో సరైన వసతులు లేవు
మా బాబుకు జ్వరం వచ్చింది. రెండు రోజుల కింద మంచిర్యాల ప్రభుత్వ జనరల్ దవాఖానకు తీసుకొవచ్చిన. డాక్టర్లు మంచిగనే చూస్తున్నరు. కానీ వసతులు లేక ఇబ్బందులు పడుతున్నం. ఫ్యాన్లు లేక ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సి వస్తున్నది. దోమల బెడద ఉంది. చిన్న పిల్లల వార్డులో బాత్రూం ఒక్కటే పని చేస్తుంది. అందరం వెళ్లాలంటే క్యూ కట్టాల్సి వస్తుంది. తాగునీటి కోసం అవస్థలు పడుతున్నం. దవాఖానాలో ఇస్తున్న భోజనం బాగోలేదు. కనీసం బెడ్లపై బెడ్ షీట్లు కూడా ఇస్తలేరు. ఒక్కో బెడ్ మీద ఇద్దరిద్దరిని ఉంచి వైద్యం చేస్తున్నరు.
– సుందిళ్ల సుమతి, ఊరు శ్రీరాంపూర్
మడత మంచాలపై పడుకోబెట్టిన్రు
నాకు జ్వరం వచ్చి మూడు రోజులై తంది. మంచిర్యాల దవాఖానాకు వచ్చిన. బెడ్లు లేవని మడత మంచా లపై వైద్యం చేస్తున్నరు. ఇక్కడ సరైన వసతులు లేవు. ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జ్వరమని వస్తే చర్మం మీద పుండ్లు అవుతున్నాయి. ఏం చేసుడో అర్థమైతలేదు. ప్రైవేటుకు వెళ్లి వైద్యం చేయించుకునే స్థోమత లేక ఇక్కడే ఉండాల్సి వస్తుంది.
– బండారి రాజేశ్వరి, కైరిరామ, ఆసిఫాబాద్
ఫ్యాన్లు లేవు..
నాకు జ్వరం రావడంతో మూడు రోజుల కింద మంచిర్యాల దవాఖానాకు వచ్చిన. వచ్చిన రోజే పరీక్షల కోసం రక్తం తీసుకున్నరు. ఇప్పటి వరకు ఏం రోగం వచ్చిందన్నది చెప్పలేదు. వరండాలో పడుకోబెట్టిన్రు. ఫ్యాన్లు లేక ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న. దోమల బెడద ఉంది.
– ఆవునూరి భానుప్రియ, మంచిర్యాల