మంచిర్యాలటౌన్ : మంచిర్యాల ఆర్టీసీ బస్టాండులో సోమవారం మధ్యాహ్నం ప్రైవేటు హైర్ బస్సు ఢీకొని చెన్నూరి లక్ష్మణ్ అనే దివ్యాంగుడికి (Disabled person) తీవ్ర గాయాలయ్యాయి. అతడి రెండు కాళ్లపై నుంచి బస్సు ముందు చక్రం వెళ్లడంతో రెండు కాళ్లు దెబ్బతిన్నాయి.
కోటపల్లి మండలం జనగాం గ్రామానికి చెందిన లక్ష్మణ్ మూగ, చెవిటి. అతనికి పెన్షన్ కోసం సదరం సర్టిఫికేట్ (Sadaram certificate) అవసరం కాగా జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు తన బావ రామగిరి సమ్మయ్యతో కలెక్టరేట్‌కు వచ్చాడు. పనిముగించుకుని స్వగ్రామానికి వెళ్లడం కోసం మంచిర్యాల బస్టాండుకు చేరుకున్నాడు.
సోమవారం మధ్యాహ్నం చెన్నూరుకు వెళ్లే పల్లెవెలుగు సర్వీసు చెన్నూరు ప్లాట్‌ఫాం వైపునకు రాగా అక్కడే బస్సు కోసం వేచి చూస్తున్న లక్ష్మణ్ మూగ, చెవిటి వాడు కావడంతో అతనికి బస్సు వస్తున్న శబ్దం వినిపించలేదు. గమనించని బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా బస్సును నడపడంతో దివ్యాంగుడిని ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తరలించారు.
బస్సులో సీటు కోసం ప్రయాణికులు పెద్ద సంఖ్యలో పరుగెత్తుకు రావడంతో ప్రమాదవశాత్తు లక్ష్మణ్ బస్సు కిందపడ్డాడని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కాగా తాము నిరుపేదలమని, ఆదుకోవాలని లక్ష్మణ్ బావ సమ్మయ్య, సోదరి అధికారులను కోరుతున్నారు.