బాసర, ఫిబ్రవరి 21: బాసరలోని ఆర్జీయూకేటీ కాన్ఫరెన్స్ హాల్లో అకాడమిక్స్పై డైరెక్టర్ సతీశ్ కుమార్, వీసీ వెంకటరమణ మంగళవారం అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ వెంకటరమణ మాటాలడారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణను విపులంగా చర్చించారు. విద్యావిధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నూతన కోర్సులు, అకాడమిక్ కమిటీల ఏర్పాటు, నాణ్యమైన విద్యను అందించేందుకు అధ్యాపకుల ఫీడ్ బ్యాక్ సిస్టం నెలకొల్పడం, విద్యార్థి హాజరును తప్పనిసరిగా చేయడం, సకాలంలో పరీక్షలు నిర్వహించి త్వరగా ఫలితాలు అందించడం, 2008 నుంచి ఇప్పటి వరకు విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వారికి వన్‌టైం చాన్స్ కింద పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించడం, అకాడమిక్ ఇయర్ 2020-2021లో చదివిన విద్యార్థులకు 40 శాతం ఫాజు రాయితీ కల్పించడం, పీయూసీ రెండేళ్లు పూర్తి చేసుకున్న విద్యార్థి ఇంజినీరింగ్ బ్రాంచ్ పొందాలంటే కచ్చితంగా 6 సీజీపీఏ ను కలిగి ఉండాలన్నారు. క్యాంటీన్ సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడుతూ భద్రతను పటిష్టం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సెక్యూరిటీ ఆఫీసర్ సీఐ రవీందర్ నాయక్, ఎస్ఐ రోహిణిని ఆదేశించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఆర్జీయూకేటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని ఉద్యోగాల్లో స్థిరపడ్డ విద్యార్థుల కోసం ఆన్లైన్ సర్టిఫికెట్ సర్వీస్‌ను వీసీ వెంకటరమణ ప్రారంభించారు. ఈ సర్వీస్ ద్వారా ఆర్జీయూకేటీ విద్యార్థులు ఇండియాలో ఉండి సర్టిఫికెట్స్ ఆన్లైన్ ద్వారా పొందాలంటే రూ. 250 పోస్టల్ చార్జీ రూపంలో చెల్లించాలని, ఇతర దేశాలల్లో ఉద్యోగం చేస్తున్న విద్యార్థులకైతే రూ. 2 వేలు పోస్టల్ చార్జీల రూపంలో చెల్లించాలని తెలిపారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు పొందేందుకు సాంకేతికతను ఉపయోగిస్తూ ‘మీ ఇంటికే సర్టిఫికెట్’ అనే పేరుతో సర్వీస్ పోర్టల్ రావడంతో విద్యార్థులకు వ్యయప్రయాసాలు తగ్గుతాయని వివరించారు. ఈ సర్టిఫికెట్ పొందే విద్యార్థులు కచ్చితంగా అన్ని బకాయిలు చెల్లించిన వారికి ఈ సేవలు అందిస్తామని తెలిపారు. ఈ పోర్టల్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సీవోఈ డాక్టర్ వినోద్, అడిషనల్ సీవోఈ రామరాజు, సునీల్ పాల్గొన్నారు.