కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ అక్రమ రేషన్ దందా ఆగడం లేదు. అధికారుల కళ్లుగప్పి అక్రమార్కులు సరిహద్దు మండలాల నుంచి వివిధ మార్గాల్లో అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఏజెన్సీప్రాంతాల్లో నేరుగా కిరాణా దుకాణ వ్యాపారులు తక్కువకు కొని పక్క రాష్ట్రంలో అధిక ధరకు విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల రేషన్ డీలర్లు షాపు వద్దనే కొని తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నా వ్యాపారులు భయం లేకుండా రేషన్ బియ్యం దందాను కొనసాగిస్తున్నారు. వారం రోజుల క్రితం జైనూర్లోని మూడు కిరాణా దుకాణాల్లో 64 క్వింటాళ్లకు పైగా రేషన్ బియ్యంతో గుడుంబా తయారీకి వాడే నల్లబెల్లం, పటిక పట్టుబడడం అక్రమ దందా జోరుగా సాగుతున్నదనే దానికి నిదర్శనంగా నిలుస్తున్నది.
ప్రభుత్వం ప్రతి నెలా పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తక్కువ ధరకు కొని మహారాష్ట్రలో విక్రయిస్తున్నారు. ఆసిఫాబాద్, రెబ్బెన, బూరుగూడ, వాంకిడి, కాగజ్‌నగర్ మరో వైపు మంచిర్యాల, బెల్లంపల్లి నుంచి స్థానిక వ్యాపారులు రేషన్ బియ్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసి చిన్న చిన్న వాహనాల్లో సిర్పూర్ టీ మండలంలోని వెంట్రావ్పేట్కు తరలించి అక్కడి నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఏజెన్సీ కేంద్రంగా ఉన్న జైనూర్ కేంద్రంగా రేషన్దందా సాగుతున్నట్లు తెలుస్తున్నది.
రేషన్ బియ్యాన్ని రూ.12లకు కొనుగోలు చేసి మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాల్లో రూ.20 వరకు విక్రయిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో, చిన్న వ్యాన్లలో బార్డర్‌లోని గ్రామాల వరకు తరలించి అక్కడ గోదాముల్లో డంప్ చేస్తారు. అక్కడి నుంచి భారీ వాహనాల్లో గొందియా, బల్లార్షలోని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. మన జిల్లా నుంచి అక్రమంగా మహారాష్ట్రకు తరలివెళ్తున్న బియ్యాన్ని పట్టుకునేందుకు మధ్యలో ఎక్కడ చెక్‌పోస్టులు లేవు. ఎక్కడైనా ఎవరైనా పొరపాటున పట్టుకుంటే వారికి మామూళ్లు ముట్టజెప్పి తప్పించుకుంటున్నారని ఆరోపణలున్నాయి. బియ్యం తరలించే వాహనాలు తెల్లవారు జామున, రాత్రి వేళల్లో అధికంగా తరలివెళ్తున్నాయి. ఇటీవల అక్రమ రవాణాపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టిసారించకపోవడంతో అక్రమ వ్యాపారులు చెలరేగిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు
పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రేషన్ బియ్యం అక్రమంగా తరలించడం, కిరాణా షాపులో నిల్వ ఉంచడం నేరం. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై గట్టి నిఘా ఉంచుతున్నాం. అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తాం. రేషన్ బియ్యం అక్రమ రవాణా గురించి ప్రజలకు ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి. అక్రమ రవాణాలను అరికట్టడంలో అన్ని గ్రామాల ప్రజలు సహకరించాలి.
– రవికుమార్, ఎస్ఐ జైనూర్