కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబరు 3 (నమస్తే తెలంగాణ) : గుర్తింపు కోసం ఆధార్ కార్డు ఉన్నట్లే ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు అందించేందుకు సర్కారు కసరత్తు మొదలు పెట్టింది.. ఈ మేరకు జిల్లాలో గురువారం నుంచి సర్వే ప్రారంభించింది.
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు, కెరమెరి మండలంలోని ధనోరా గ్రామం, కాగజ్నగర్ మున్సిపాలిటీలోని 14వ వార్డు, సిర్పూర్-టీ మండలంలోని వెంకట్రావ్పేట్లో సర్వే మొదలైంది. ఒక్కోచోట మూడు బృందాలను నియమించగా, ప్రతి రోజూ ఒక్కో బృందం 30 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంటుంది. ఈనెల 7వ తేదీ వరకు సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అధికారులను ఆదేశించారు. సుమారు 15 కుటుంబాలను సర్వే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
డిజిటల్ కార్డు ఆధారంగానే..
ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఇతర సేవలు డిజిటల్ కార్డు ఆధారంగానే అమలు కానునన్నాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోని 3వ వార్డులో సర్వే కోసం 3 టీంలు, కెరమెరి మండవలం ధనోరాలో 2 టీంలు, కాగజ్నగర్ మున్సిపాటీలోని 14 వార్డులో 3 బృందాలు, సిర్పూర్(టీ) మండలం వెంకట్రావ్పేట్ గ్రామంలో మూడు బృందాలు సర్వే చేపట్టనున్నాయి. ఈ సర్వేలో కుటుంబ సభ్యులందరికీ కలిపి ఒక డిజిటల్ నంబరు ఇవ్వనున్నారు. అలాగే కుటుంబంలోని సభ్యులందరికీ ఒక్కొక్కరికీ ఒక్కో డిజిటల్ నంబరు కేటాయిస్తారు. వ్యక్తిగత నంబరులో పూర్తి వివరాలు పొందుపరుస్తారు.
మార్పులు.. చేర్పులు
ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఇప్పటికే వివిధ రకాల గుర్తింపు కార్డులున్నా యి. ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు ఇలా అన్ని వివరాలను కలిపి ఒక్కటే డిజిటల్ కార్డును ప్రభు త్వం జారీ చేయనున్నది. రేషన్ కార్డు, పింఛన్లు, స్వయం సహాయక సంఘాల రుణాలు, రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ, ఆరోగ్య శ్రీ, కంటి వెలుగు తదితర వివరాల డేటా ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్నందున వాటిని నిర్ధారించుకుంటారు. కుటుంబంలో ఎవరైనా మరణించి ఉంటే వారి పేరును తొలగిస్తారు.
కుటుంబాలు వేరుపడినా, వారి ఇళ్లలో పుట్టిన పిల్లల వివరాలను నమోదు చేసుకుంటారు. సర్వేకు వచ్చే బృందాలకు ఆధార్ కార్డుతో సహా కుటుంబ సభ్యులు వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు లేకుంటా ఇతర ఏదైనా గుర్తింపు కార్డు ఇస్తే సరిపోతుంది. ఒక వ్యక్తి రెండు కుటుంబాల్లో సభ్యులుగా ఉండకూడదని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారి తొలగించటం, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారి వివరాలు మార్పులు.. చేయడం.. కొత్తవారివి నమోదు చేయడంతో పాటు ప్రజలు అందించే కొత్త సమాచారాన్ని అప్డేట్ చేస్తారు.