మంచిర్యాల అర్బన్ : డయాబెటిస్ రోగుల్లో ( Diabetics Patients ) కాళ్లకు రక్తప్రసరణ తగ్గడం (పీఏడీ) పై అవగాహన అత్యవసరమని సీనియర్ కన్సల్టెంట్, ఎండోవాస్కులర్ సర్జన్, క్లీనికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు (Dr. Srikanth Raju ) అన్నారు. బుధవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
డయాబెటిస్ ఉన్న వారిలో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (పీఏడీ) సమస్య వేగంగా పెరుగుతోందని వెల్లడించారు. డయాబెటిస్ రోగుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండి, చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారే ప్రమాదం ఉందన్నారు. నరాల సమస్య కారణంగా కొందరిలో నొప్పి తెలియకపోవచ్చని హెచ్చరించారు.
నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి, కాళ్లు త్వరగా అలసిపోవడం, పాదాలు చల్లగా ఉండటం, మానని గాయాలు, వేళ్లు నల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సకాలంలో కాళ్ల రక్తపోటు పరీక్ష, డాప్లర్ స్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ముందే గుర్తించి చికిత్స చేయవచ్చన్నారు.
డయాబెటిస్ రోగులు రక్త చక్కెరను కట్టుదిట్టంగా నియంత్రించుకోవాలని, పొగతాగడం పూర్తిగా మానాలని, అవసరమైతే మందులు లేదా యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి రోజు పాదాలను పరిశీలించడం, గాయాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం ముఖ్యమని వివరించారు. ముందస్తు అవగాహన, సకాలంలో చికిత్సతో కాలు కోల్పోయే ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ మేనేజర్ నవీన్ కుమార్ పాలకుర్తి పాల్గొన్నారు.