కుభీర్ : విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి సింగిల్ ఫేస్ విద్యుత్ సరఫరాను ( Single-Phase ) 24 గంటలు నిరంతరం అందించాలని డిమాండ్ చేస్తూ కుభీర్ మండలంలోని ( Kubheer Mandal) సోనారి సబ్ స్టేషన్ ఎదుట సోనారి గ్రామానికి చెందిన రైతులు ధర్నా నిర్వహించారు. ఏ ఈ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆదివారం కొద్దిసేపు ధర్నా నిర్వహించారు.
గత 10 ఏళ్ల కాలంగా గ్రామంలోని సబ్ స్టేషన్ నుంచి 24 గంటల సింగిల్ ఫేస్ విద్యుత్ సరఫరా అయ్యేదని తెలిపారు. గత ఏడాది ప్రభుత్వం మారిన అనంతరం ప్రస్తుత ఏ ఈ ఆదిత్య గ్రామానికి ఉన్న సింగిల్ ఫేస్ సరఫరా విద్యుత్ లైన్ ను తొలగించి నిగ్వా ఫీడర్ కు కలపడంతో త్రీ పేజ్ మాత్రమే సరఫరా అవుతుందని ఆరోపించారు. సింగిల్ ఫేస్ విద్యుత్ నిరంతరం సరఫరా కావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
సబ్ స్టేషన్ ఉన్న గ్రామంలో 24 గంటలు చేయాలన్న నిబంధనను తుంగలో తొక్కి విద్యుత్ శాఖ అధికారులు ఇలా చేయడం సరికాదని పేర్కొన్నారు. తమ గ్రామానికి సింగల్ ఫేస్ విద్యుత్తును 24 గంటలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సబ్ స్టేషన్ ఎదుట నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో బీఆర్ఎస్ నాయకుడు మల్లారెడ్డి, నాగభూషణ్, గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.