కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : రూ. 2 లక్షలోపు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు కన్నెర్ర చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్ మాట్లాడుతూ ఆదివాసీ జిల్లాలో రుణమాఫీ సక్రమంగా అమలు కాలేదని, ఇందుకు కారకులైన వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. ఆదివాసీ బిడ్డ, జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న సీతక ప్రత్యేక చొరవ తీసుకొని రైతులందరికీ వెంటనే రుణమాఫీ అయ్యేలా చూడాలన్నారు.
ఈ నెల 31లోగా సర్కారు దిగిరాకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొరెంగ మాలశ్రీ, జిల్లా ఉపాధ్యక్షులు కోట. శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి మాడవి గణపతి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి చాపిలె సాయి కృష్ణ, డీవైఎఫ్ఐ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ చాపిడి శ్రావణి, జిల్లా ఉపాధ్యక్షుడు చాపిడి పురుషోత్తం, సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, టీఏజీఎస్ నాయకులు మరప హన్మంతు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్, ఐద్వా జిల్లా కార్యదర్శి దుర్గం అనిత, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.