రామకృష్ణాపూర్, జూలై 28 : మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామం,క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 9వ వార్డులో మంచిర్యాల-చంద్రపూర్ జాతీయ రహదారి పక్కన కొలువుదీరిన గాంధారి మైసమ్మ జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢమాసం బోనాల పండుగ నిర్వహించగా, భక్తజనం తరలివచ్చి దర్శించుకున్నది.
గాంధారిఖిల్లాలోని కోట మైసమ్మకు ప్రత్యేకపూజలు నిర్వహించి పసుపు, కుంకుమ తీసుకొచ్చి గాంధారివనం సమీపంలో కొలువైన మైసమ్మ ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, భక్తులు బొక్కలగుట్ట పాలవాగు నుంచి డప్పుచప్పుళ్ల నడుమ ఊరేగింపుగా వెళ్లి 108 బోనాలకు పూజలు చేశారు.
డప్పుచప్పుళ్లు, శివసత్తులు, జోగినీలు, భక్తుల నృత్యాల మధ్య ఎమ్మెల్యే వివేక్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, 9వ వార్డు కౌన్సిలర్ పారిపెల్లి తిరుపతి, ఆలయ కమిటీ సభ్యులు బోనాలతో వచ్చి అమ్మవారికి సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గాంధారి వనంలోని చిల్డ్రన్ పార్కు నిండిపోయింది. బొక్కలగుట్ట పాలవాగు వరకు భక్తులు కుటుంబాలతో విడిది చేసి వంటావార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు.
కాగా, ఎమ్మెల్యే వివేక్ బోనమెత్తుకొని పది అడుగులు వేశారు. ఆపై అక్కడి నుంచి ఆలయానికి చేరుకొని మైసమ్మను దర్శించుకొని వెళ్లిపోయారు. పోలీసు అధికారులు ఆయన వెంటే వెళ్లడంతో బోనాలు ఎత్తుకొని వస్తున్న భక్తులకు ఆ దశలో రక్షణ కరువైంది. బోనాల ప్రదర్శన (ఊరేగింపు) ఒకరిమీదొకరు పడినంతపనైంది. దీంతో కొందరు బోనాలు ఎత్తుకున్న భక్తులు రక్షణ కల్పించాలని అధికారులతో వాదనకు దిగారు. చివరకు పోలీసుల రక్షణలో ఆలయం చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
భారీగా పోలీసు బందోబస్తు
జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటలు జరుగకుండా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో మందమర్రి సీఐ శశిధర్రెడ్డి, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఉదయం నుంచే సీఐ శశిధర్రెడ్డి,రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్ ఎలాంటి అవాంఛనీయ ఘటనల జరుగకుండా పర్యవేక్షించారు. మందమర్రి తహాసీల్దార్ చంద్రశేఖర్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ ఎన్. మురళీకృష్ణ, కౌన్సిలర్లు పారిపెల్లి తిరుపతి, ఆలయ కమిటీ అధ్యక్షుడు సమ్మయ్య, సభ్యులు బీమ సుధాకర్, కందునూరి రాజన్న, వేనెంక కుమార్, సత్యనారాయణ, కనకయ్య, గుండ మల్లేశ్ పాల్గొన్నారు.