జైపూర్/దస్తురాబాద్, ఫిబ్రవరి 19;మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలు భక్తజనంతో కిక్కిరిశాయి. రెండు రోజుల పాటు శివనామ స్మరణతో మారుమోగాయి. శివపార్వతుల కల్యాణోత్సవాలు కనుల పండువగా సాగగా, ప్రజలు కనులారా వీక్షించి తరించారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేసి పట్నాలు, బోనాలతో ఇష్ట దేవుడిని దర్శించుకున్నారు. రుద్రాభిషేకాలు, లింగోద్భవ పూజలు నిర్వహించారు. పలుచోట్ల ప్రముఖులు హాజరై త్రినేత్రుడికి మొక్కులు తీర్చుకున్నారు.
జైపూర్, ఫిబ్రవరి 19 : వేలాల జాతరకు భక్తజనం పోటెత్తింది. రెండో రోజైన ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచే క్యూలైన్లు కిక్కిరిసి కనిపించాయి. శనివారం గుట్టపై గట్టు మల్లన్నను దర్శించుకున్న భక్తులు ఆదివారం గుట్ట కిందకు వచ్చారు. వేలాల సమీప గోదావరి పుష్కరఘాట్ల వద్ద పుణ్యస్నానాలాచరించారు. గొర్రె పిల్లలతో గోదారమ్మకు మొక్కులు చెల్లించారు. అనంతరం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నా రు. బోనాలు వండి నైవేద్యంగా పెట్టారు.
ఎంపీడీవో సత్యనారాయణ పారిశుధ్య లోపం తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. గ్రామం, గోదావరి తదితర ప్రాంతాల్లో శానిటైజేషన్ చేయాలని మండల ప్రత్యేకాధికారి ప్రభాకర్‌రావు సిబ్బందికి సూచించారు. వేలాల గోదావరి తీర ప్రాంతంతో పాటు గ్రామ శివారు మొత్తం గుడారాలు కనిపించాయి. లక్షకు పైగా భక్తులు వచ్చినట్లు ఆలయ ఈవో రమేశ్ తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జైపూర్ ఏసీపీ నరేందర్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. శ్రీరాంపూర్ సీఐ రాజు, జైపూర్ ఎస్ఐ రామక్రిష్ణ ఉన్నారు.
గట్టు మల్లన్నను దర్శించుకున్న సీపీ..
వేలాల జాతరలో రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి పర్యటించారు. మొదట మల్లికార్జున స్వామికి పూజలు చేసిన ఆమె.. ఆపై గుట్టపైకి వెళ్లి మల్లన్నస్వామిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది సీపీకి ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం కంట్రోల్‌రూమ్‌ను పరిశీలించారు. డ్రోన్ కెమెరా ద్వారా వేలాల పరిసరాల్లోని రద్దీని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో కలిసి పరిశీలించారు. వేలాలలో విధులు నిర్వహిస్తున్న పోలీసులను ఆమె అభినందించారు. వేలాల గుట్టపై ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది.