సిర్పూర్(టీ) : నియోజకవర్గంలోని అన్ని మండలాలను అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు తానే బాధ్యత తీసుకుంటానని వెల్లడించారు. పెండింగ్ పనుల పూర్తికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఆర్ అండ్ బీ రోడ్డుకు ఇరువైపులా సైడ్ డ్రైన్ నిర్మాణానికి నియోజకవర్గం నిధుల నుంచి రూ.10 లక్షలను మంజూరు చేశారు.
పేట్ మహేళా నుంచి డౌనల్ ప్రాంతం వరకు ఆర్ అండ్ బీ రోడ్డు పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చునార్కర్ సువర్ణ, సర్పంచ్ తఫిమా పర్విన్, వైస్ ఎంపీపీ ఈర్త సత్యనారాయణ, ఎంపీటీసీలు సుహేల్ అహ్మద్, తుకారం, కారం శైలజ, ఉప సర్పంచ్ తోట మహేశ్, మండల కో ఆప్షన్ సభ్యుడు కీజర్ హుస్సేన్, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ నీరటి సత్యనారాయణ, ఐకేపీ ఏపీఎం దుర్గయ్య, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.