మంచిర్యాల అర్బన్, జూలై 28 : మంచిర్యాల జిల్లాలో డెంగీ ఫీవర్ భయపడుతున్నది. పట్టణాలు, పల్లెల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారి దోమలు విజృంభిస్తుండగా, రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు టీ హబ్‌లో 2 వేలకు పైగా పరీక్షలు నిర్వహించగా, 25 పాజిటివ్ కేసులు వచ్చినట్లు తేలింది. డెంగీ వచ్చిన వారంతా ప్రైవేట్ హాస్పిటళ్లకు పరుగులు పెడుతుండగా, యజమానులు ఇదే అదనుగా భావించి రూ. లక్షలు దండుకుంటున్నట్లు తెలుస్తున్నది. నిన్నమొన్నటి వరకు ప్రతి రోజూ ప్రభుత్వ దవాఖానకు 400 మంది ఓపీ పేషెంట్లు రాగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1000కి పైగా పెరగడం ఆందోళనకు గురిచేస్తున్నది.
25కు పాజిటివ్ కేసులు
ఈ యేడాది ఇప్పటి వరకు 25 మందికి డెంగీ జ్వరం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో మంచిర్యాల మండలం జన్నారం 2, తాళ్లపేట 2, దండెపల్లి 3, వెంకట్రావుపేట 2, మందమర్రి 2, పాత మంచిర్యాల 1, చెన్నూర్ మండలానికి సంబంధించి అంగరాజ్పల్లి 1, బెల్లంపల్లి మండలంలోని భీమిని 1, తాండూర్ 2, తాళ్లగురిజాల 4, షంశీర్నగర్ 5 కేసులు నమోదయ్యాయి. మలేరియాకు సంబంధించి 2 కేసులు నమోదయ్యాయి.
విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు
ఓ వైపు డింగీ టెన్సన్ పెడుతుంటే.. మరోవైపు సీజనల్ వ్యాధులు విజృంభిస్తూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. పల్లెలు, పట్టణాల్లో జ్వరబాధితులు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఈ బృందంలో జిల్లా మలేరియా నియంత్రణ అధికారి, మలేరియా నియంత్రణ సహాయ అధికారి, ముగ్గురు సబ్ యూనిట్ ఆఫీసర్లు ఉన్నారు. వీరు ఎప్పటికప్పుడు సీజనల్ వ్యాధులపై అప్రమత్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కేసులు నమోదైన చోట జ్వర సర్వేలు నిర్వహిస్తున్నారు. కేసులు వచ్చిన చోట్ల చుట్టుపకల ఇండ్లను కూడా పూర్తిగా పరీక్షిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల ఇండ్లలో జర్వ సర్వే చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అందులో జలుగు, జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులు, ఇతర సీజనల్ వ్యాధులు, జ్వరాలు ఉన్నట్లు తెలింది. తీవ్ర జ్వరం ఉన్న వారిని ప్రభుత్వ హాస్పిటల్, పీహెచ్‌సీలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మాములుగా ఉంటే అక్కడే మందులను అందజేస్తున్నారు.
బ్రీడింగ్ చెక్కర్స్తో సర్వే..
పట్టణాలు, పల్లెల్లో జ్వర బాధితులను గుర్తించడానికి ప్రత్యేకంగా బ్రీడింగ్ చక్కర్స్తో సర్వే నిర్వహిస్తున్నారు. పదో తరగతి పూర్తి చేసిన 15 మంది విద్యార్థులు, సిబ్బంది ప్రతి రోజూ 100 ఇండ్లలో సర్వే చేస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జ్వర అనుమానితులున్నైట్లెతే అధికారులకు సమాచారం ఇస్తున్నారు.
ప్లేట్లెట్స్ తగ్గితే డెంగీ అని నిర్ధారించుకోవద్దు
రక్తపరీక్ష చేసుకున్నప్పుడు ప్లేట్లెట్స్ తగ్గితే డెంగీ జ్వరం వచ్చినట్లు నిర్ధారించుకోవద్దు. టైఫాయిడ్, టీబీ, ఇతర వైరల్ ఫీవర్‌లో కూడా ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ర్యాపిడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత డెంగీ అనుమానమున్నట్లు తెలితే శాంపిళ్లు సేకరించి టీ హబ్‌కు పంపిస్తాం. ఎలీజా టెస్ట్ చేసిన తర్వాత అందులో పాజిటివ్ వస్తేనే డెంగీ వచ్చినట్లు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్యశిబిరాలు నిర్వమిస్తున్నాం. ప్రభుత్వ దవాఖానాల్లో మలేరియా, డెంగీ కిట్స్ అందుబాటులో ఉన్నాయి.
– డా.అనిత, జిల్లా ఉప వైద్యాధికారిణి