నిర్మల్ టౌన్, మే 16 : అవగాహన, అప్రమత్తతతోనే అంటు వ్యాధులను దూరం చేసుకోవచ్చని నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జాతీయ డెంగీ నివారణ అవగాహన ర్యాలీని కలెక్టర్ కార్యాలయంలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని అన్ని వీధుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల్లో అంటువ్యాధులు అతి భయంకరమైనవని, అందులో డెంగీపై ప్రజలు అప్రమత్తతతో ఉండేలా చూడాలన్నారు. దోమకాటుతో వచ్చే ఈ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ముందే అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, చెడిపోయిన వస్తువులను నిల్వ ఉంచుకోవద్దని సూచించారు.అందకే ప్రభుత్వం ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్, వైద్యుడు రాజేందర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత కోసం నిర్వహిస్తున్న స్వచ్ఛ్ సర్వేక్షన్ యాక్షన్‌ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేసి సర్వేక్షణ్‌లో గ్రామాలకు జాతీయస్థాయిలో అవార్డులు వచ్చేలా ప్రతి ఒక్కరూ పర్యవేక్షించాలని కలెక్టర్ వరుణ్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో స్వచ్ఛ్ సర్వేక్షణ్‌పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డుల కోసం పోటీపడేలా, గ్రామాల అభివృద్ధిపై ఎప్పటికప్పుడు అన్ని వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు, వాటితో కలిగే ప్రయోజనాలు, ప్రజలకు మౌళిక సదుపాయలు తదితర అంశాలను పరిశీలించి స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో జిల్లాకు ఎక్కువగా వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, డీపీవో శ్రీలత, ఎంపీడీవోలు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.