కాసిపేట, జూన్ 27 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్(అదానీ) సిమెంట్ కంపెనీ ముడి సరుకు మాయమైపోతున్నది. అదానీ గ్రూప్ ఓరియంట్ కంపెనీని కొనుగోలు చేశాక.. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతూ దేశం మొత్తంగా రవాణా చేస్తున్నది. ఇది వరకు కేవలం రైళ్లలో మాత్రమే రవాణా చేసిన క్లింకర్‌ను ప్రస్తుతం లారీల్లోనూ తరలిస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇది ఇలాగే కొనసాగితే వనరుల కొరత ఏర్పడి కంపెనీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆవేదన అడవిబిడ్డల్లో కనిపిస్తున్నది. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో కోట్లు కొల్లగొడుతున్నట్లు తెలుస్తుండగా, ఇకనైనా ముడి సరుకు తరలింపుపై పరిమితులు విధించాలన్న గిరిజనం డిమాండ్ చేస్తున్నది.
కాసిపేట మండలం దేవాపూర్, గట్రావ్‌పల్లి శివారులో సిమెంట్‌కు ఉపయోగించే సున్నపు రాయి తవ్వకాలు జరుగుతున్నాయి. ఓరియంట్(అదానీ) కంపెనీ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు రూ.20, ప్రభుత్వానికి రూ.80 చొప్పున టన్నుకు పన్ను రూపంలో చెల్లిస్తున్నది. దాదాపు 210 హెకార్లలో ఈ తవ్వకాలు సాగుతున్నాయి. తవ్వకాలు చేపట్టిన సున్నపు రాయిని కంపెనీలో క్లింకర్గా మార్చి సిమెంట్ తయారీకి ఉపయోగిస్తారు. ఇక్కడ సిమెంట్ తయారీ చేయడంతో పాటు వారానికోసారి రైలు మార్గం ద్వారా మహారాష్ట్రలోని జలగాంలోని ఓరియంట్ కంపెనీకి సంబంధించిన కంపెనీకి క్లింకర్ తరలించే వారు.
ఓరియంట్ సిమెంట్ కంపెనీ కాస్త అదానీ గ్రూప్ కొనుగోలు చేయడంతో అప్పటి నుంచి వారానికి నాలుగు నుంచి ఆరుసార్లు రైళ్ల ద్వారా క్లింకర్‌ను దేశంలోని అదానీ కంపెనీలన్నింటికీ తరలించుకుపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒక్క మే నెలలోనే వేలాది టన్నుల సున్నపురాయి తవ్వకాలు చేపట్టినట్లు సమాచారం. ఈ నెలలోనే సుమారు పదుల సంఖ్యల రైళ్లలో ఇరత రాష్ర్టాలకు క్లింకర్ తరలిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే కొన్నేళ్లకే కంపెనీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది వరకు క్లింకర్ రైలు మార్గం ద్వారానే వెళ్లేదని.. కానీ ఇప్పుడు లారీల్లో తరలిస్తున్నారని మండిపడుతున్నారు. గనుల నుంచి ఎంత మేర తవ్వకాలు చేపడుతున్నారనే సమాచారం ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి ఏ అధికారి ఉండరని, కంపెనీ వాళ్లేమో ఎవరిని లోపలికి రానివ్వరని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఆశపడి పరిశ్రమ ఏర్పాటుకు 1980 (బిర్లా కంపెనీ)లో ఆదివాసులు భూములు ఇచ్చారు. ఇలా మొదలైన సిమెంట్ పరిశ్రమ కాలక్రమంలో మూడు ప్లాంట్లకు విస్తరించింది. కంపెనీకి ప్రత్యేక రైలు మార్గాన్ని సైతం ఏర్పాటు చేసుకొని దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించింది. దాదాపు 44 ఏళ్లుగా బిర్లా కంపెనీ పేరుతో నడుస్తున్న ఓరియంట్ కంపెనీని గతేడాది అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. గత నెల నుంచే అదానీ గ్రూప్ కార్యకలాపాలను సాగిస్తుంది. మొదటి నెలలోనే అదానీ గ్రూప్‌నకు సంబంధించిన పలు కంపెనీలను ఇక్కడి నుంచి క్లింకర్‌ను రైలుమార్గంతో పాటు లారీల్లోనూ వేల టన్నులను తరలించినట్లు తెలిసింది.
దీంతో స్థానికంగా దొరికే ముడి సరకు త్వరగా ఖాళీ అయ్యే అవకాశమున్నది. త్వరగా కంపెనీ మూతపడి స్థానికులు ఉపాధి కోల్పోయే అవకాశాలున్నాయి. ఇక్కడ వనరులు వాడుతూ ఇక్కడే సిమెంట్ తయారీ చేస్తే ఉపాధి అవకాశాలతో పాటు ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుంది. కానీ, సున్నపు రాయిని తీసి క్లింకర్గా మార్చడానికి పెద్దగా మ్యాన్‌పవర్ అవసరం లేదు. దీంతో రానున్న రోజుల్లో స్థానికులకు ఉపాధి కష్టమయ్యే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ అనుబంధంతో నడుస్తున్న తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సున్నపు రాయి గనులను కంపెనీకి ప్రభుత్వం కేటాయించింది. దాదాపు 210 హెక్టార్లలో తవ్వకాలు చేపడుతున్నారు. ప్రతి టన్నుకు కార్పొరేషన్‌కు కంపెనీ రూ.20 చొప్పున చెల్లిస్తుండగా, ప్రభుత్వానికి రూ.80 చెల్లిస్తున్నారు. తవ్వలు చేపట్టిన సున్నపు రాయిని కంపెనీ క్లింకర్గా మార్చి ఇక్కడే సిమెంట్ తయారీ చేయాలి. కానీ.. ఇక్కడి ముడిసరుకును వివిధ రాష్ర్టాలకు తరలించుకుపోతుంది. ఇది వరకు కేవలం మహారాష్ట్రలోని జలగాంలోని కంపెనీకి మాత్రమే తరలించగా, ప్రస్తుతం దేశంలో పలు కంపెనీలకు తరలించడం గమనార్హం.
గత ప్రభుత్వంలో నూతన పరిశ్రమలు, గనుల ఏర్పాటుకు రాయితీలను ప్రకటించింది. ఈ రాయితీలను పొందిన యజమాన్యం ఇకడే సిమెంట్ తయారీ చేస్తే బస్తా మీద వచ్చే పన్ను సైతం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. కేవలం టన్నుకు రూ.100లు ఇస్తున్నారని చూసుకుంటున్నారే తప్ప.. ఇక్కడ సిమెంట్ తయారు చేయకపోవడం వల్ల జరిగే నష్టాలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత విలువైన వనరులను తరలిస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదని స్థానికులు చెబుతున్నారు.
టన్నుకు రూ.100 రాయల్టీ చెల్లించి ఇక్కడ సిమెంట్ తయారు చేయకుండా, ఎలాంటి పన్నులు చెల్లించకుండా క్లింకర్‌ను ఇతర రాష్ర్టాలకు తరలిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయానికి సైతం గండి పడుతున్నది. తమ ముడి సరుకును ఇతర ప్రాంతాలకు తరలిస్తూ కంపెనీ లాభం పొందుతుందే తప్ప.. మాకెలాంటి ప్రయోజనం లేదని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సున్నపు రాయి వందల టన్నులు తవ్వి, క్లింకర్గా ఇతర రాష్ర్టాలకు తరలిస్తుంటే అడ్డుకోవాల్సిన కార్మిక సంఘాలే యాజమాన్యానికి తొత్తులుగా మారాయని స్థానికులు మండిపడుతున్నారు. విచ్చలవిడిగా వనరుల తరలింపు విషయమై మైనింగ్ అధికారులను వివరణ కోరే ప్రయత్నించగా ఫోన్లో అందుబాటులోకి రాలేదు.
అదానీ గ్రూప్ ఓరియంట్ను కొనుగోలు చేసిన తర్వాత ఇష్టారాజ్యంగా క్లింకర్‌ను తరలిస్తున్నారు. రోజూ రైలు మార్గం ద్వారా మూడు.. నాలుగు వేల టన్నులను రవాణా చేస్తున్నారు. దీంతో కంపెనీ జీవిత కాలం తగ్గి పోయే ప్రమాదముంది. ఇంత దారుణంగా వనరులను దోచుకోవడం, క్లింకర్‌ను తరలించడం ఎప్పుడూ చూడ లేదు. దీనిపై కలెక్టర్, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి. ఇక్కడి వనరులను వినియోగించి ఇక్కడే సిమెంట్ తయారీ చేయాలి. గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని రకాల అభివృద్ధి చేయాలి.
– దండవేణి చందు, యువశక్తి యూత్ అధ్యక్షుడు, దేవాపూర్