మంచిర్యాలటౌన్, ఆగస్టు 27 : దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట టీజీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను దుంగలో తొక్కిందని మండిపడ్డారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు చెల్లిస్తామని ఇలా అనేక హామీలిచ్చి అధికారంలోకి రాగానే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించాలని, వెల్ఫేర్ కమిటీలను రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ చేయాలని, టీజీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకే ఇవ్వాలని, 2013, 2017 వేతన సవరణ బకాయిలను చెల్లించాలని, 2021 వేతన సవరణ వెంటనే అమలు చేయాలని, సంపూర్ణ ఉద్యోగ భద్రతను కల్పించాలని, ఉద్యోగులు, కార్మికులపై పనిభారం తగ్గించాలని, పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ మంచిర్యాల డిపో అధ్యక్షుడు శంకర్, ఉద్యోగులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.