108.. అంబులెన్స్ సిబ్బంది ఆపత్కాలంలో అండగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. సకాలంలో స్పందిస్తూ బాధితులను హాస్పిటళ్లకు చేర్చి ప్రాణాలు కాపాడుతున్నది. ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొని సేవలందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నది. నేడు 108 పైలెట్స్ డే సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
– కోటపల్లి, మే 25
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 108 వాహనాల్లో మొత్తం 176 మంది పైలెట్లు విధులు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో 108 వాహనాలు 18 ఉండగా, 45 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 108 వాహనాలు 25 ఉండగా, 60 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 108 అంబులెన్స్‌లు 15 ఉండగా, 36 మంది, నిర్మల్ జిల్లాలో ‘108’లు 16 ఉండగా, 36 మంది విధులు నిర్వహిస్తున్నారు. అంబులెన్స్‌లను సమర్థవంతంగా నడుపుతూ ఘటనా స్థలానికి క్షణాల్లో చేరుకొని బాధితులను హాస్పిటళ్లకు చేర్చడంలో పైలెట్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. 108 అంబులెన్స్‌కు ఒక కన్ను ఈఎంటీ అయితే, మరో కన్ను పైలెట్. వీరి సేవలను ఎంత కొనియాడినా తక్కువే. విమానాలు నడిపేవారిని పైలట్ అని పిలుస్తుండగా, అంబులెన్స్ డ్రైవర్లను సైతం పైలెట్‌గా పిలుస్తూ సముచిత గౌరవం కల్పిస్తున్నాం. ఘటనా స్థలం నుంచి హాస్పిటల్‌కు తీసుకెళ్లే సమయాన్ని గోల్డెన్ అవర్‌గా భావిస్తారు. ఎందుకుంటే ఈ సమయం చాలా విలువైనది. ఈ సమయంలో పైలెట్ అప్రమత్తంగా లేకపోయినా.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. భారీ మూల్యం తప్పదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ నిత్యం వందలాది మంది బాధితులకు భరోసానిస్తూ ప్రత్యక్ష దైవాలుగా నిలుస్తున్నారు 108 పైలెట్లు.
ప్రమాదమని తెలిసినా కొవిడ్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి 108 సిబ్బంది సేవలందించారు. కొవిడ్ రోగులు, అనుమానితులను హాస్పిటళ్లకు చేర్చడం.. ఐసొలేషన్ సెంటర్లకు తీసుకురావడం వీరి పాత్ర మరవలేనిది. కొవిడ్ పేషెంట్లను తీసుకొని హైదరాబాద్ వంటి పట్టణాలకు వెళ్లినప్పుడు పైలెట్‌తో పాటు ఈఎంటీ ఒక రోజంతా కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో పైలెట్లలో 60 శాతం మందికి కొవిడ్ సోకినప్పటికీ.. తిరిగి కోలుకొని సేవలందించి ప్రశంసలు అందుకున్నారు.