దహెగాం, మే 15 : ధాన్యం తూకంలో మోసం ఘటనలో సహకార సంఘం అసిస్టెంట్ సీఈవో, ఒడ్డుగూడ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు తుమ్మిడ నారాయణను సస్పెన్షన్ చేసేందుకు సిఫారసు చేసినట్లు కుమ్రం భీం ఆసిఫాబాద్ డీసీఏవో మహ్మద్ రబ్బాని తెలిపారు. బుధవారం సహకార సం ఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఒడ్డుగూడలో వరి ధాన్యం తూకంలో మోసం చేస్తున్నట్లు మంగళవారం రైతులు ఆందోళన చేయడంతో పాటు కలెక్టర్కు ఫిర్యా దు చేశారు. ఈ ఘటనపై వివిధ పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు.
ఈ విషయంపై బుధవారం విచారణ చేపట్టగా కాంటాలో లోపాలున్నట్లు తేలిందన్నారు. ఆ విషయంపై కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు నారాయణ పట్టించుకోకపోవడాన్ని విధుల్లో నిర్లక్ష్యంగా పరిగణించామని తెలిపారు. ఇంతకు ముందు కూడా 220 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లుకు పంపించారని, అందుకు సంబంధించిన తూకంపై కాంటాను పరిశీలించగా నాలుగు క్వింటాళ్ల ధాన్యం అదనంగా వచ్చినట్లు గుర్తించినట్లు తెలిపారు. అదనంగా వచ్చిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను సదరు రైతులకు అందిస్తామని తెలిపారు. నారాయణ సస్పెన్షన్ సిఫారసును జిల్లా కమిటీకి పంపించామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని పేర్కొన్నారు.