కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : మారుమూల పల్లెల్లో జోరుగా గంజాయి సాగవుతున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల కెరమెరి మండలం దేవుడుపల్లిలో పోలీసులు తనిఖీలు చేయగా, తాక్సాండే పోచిరాం పత్తి చేనులో గంజాయి మొక్కలు కనిపించడం ఇందుకు బలం చేకూరుస్తున్నది. కొందరు గుట్టుచప్పుడు కాకుండా దందా సాగిస్తున్నట్లు సమాచారముండగా, పోలీసుశాఖ ప్రత్యేక నిఘా పెట్టి ఉక్కుపాదం మోపే లక్ష్యంతో ముందుకెళ్తున్నది.
ఇటీవల పలుచోట్ల పట్టివేత
కొద్ది రోజులుగా పోలీసులు తనిఖీలు చేపడుతుండగా, పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడుతున్నది. జైనూర్ మండలం గౌరీ పంచాయతీ పరిధిలోని కొలాంగూడకు చెందిన ఆత్రం భీంరావు ఇంటి వద్ద తనిఖీలు చేయగా, 3 కిలోల ఎండబెట్టిన గంజాయి దొరికింది. అలాగే సిర్పూర్-యు మండలంలో నలుగురి వద్ద 700 గ్రాముల మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. మోటర్ సైకిల్‌పై పాములవాడ గ్రామం నుంచి సిర్పూర్-యు వైపు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
జైనూర్ మండల కేంద్రంలోని కాలేజీగూడ దగ్గర చేపట్టిన వాహనాల తనిఖీల్లో జైనూర్ నుంచి ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న ఇండికా కారును ఆపి తనిఖీ చేయగా, అందులో 1.5 కిలోల గంజాయి లభించింది. రెండేళ్లక్రితం వాంకిడి మండలం లెండిగూడలోని ఓ చేనులో 75 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. 450 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే తిర్యాణి మండలం ఎర్రబండలో 400 గంజాయి మొక్కలు, సిర్పూర్-యులో 550 మొక్కలు, ఆసిఫాబాద్ మండలం తుంపల్లిలో 40 మొక్కలు, కాగజ్‌నగర్‌లో 14 మొక్కలు, జైనూర్‌లో 100 మొక్కలు ధ్వంసం చేశారు.
పోలీసుల ఉక్కుపాదం..
జిల్లాలో గంజాయి సాగును అరికట్టేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గతంలో గుట్టలను ఆనుకొని ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో తనిఖీలు చేపట్టి గంజాయి సాగును అడ్డుకున్నారు. గంజాయి రవాణా, విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. గంజాయిని సాగుచేసేలా ప్రలోభాలు పెట్టేవారిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మళ్లీ మారుమూల ప్రాంతాల్లో గంజాయి పట్టుబడుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గంజాయి సాగుపై పక్కాసమాచారాన్ని సేకరిస్తూ తనిఖీలు చేపడుతున్నారు. అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. యువత పెడదారి పట్టకుండా చైతన్యపరుస్తున్నారు.