పెంబి, ఏప్రిల్ 28 : పెంబి మండల కేంద్రంలో విద్యుదాఘాతంతో పంటలు కాలిబూడిదయ్యాయి. మండల కేం ద్రానికి చెందిన గోస్కుల శ్రీను 1.25 ఎకరాలు, గోస్కుల తిరుమల 2 ఎకరాలు, కోప్పుల జ్యోతి 2 ఎకరాలు, ఎలిగేటి అనిల్ కుమార్ 2 రకరాలు, ఒడ్నాల ఉమకు సంబంధించిన మొక్కజొన్న పంట రెండెకరాల్లో కాలిబూడిదైంది. రెవెన్యూ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. దాదాపు రూ.7.5 లక్షల పంట నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా విద్యుత్ వైర్లు లూజ్‌గా ఉండడం వల్ల పంట కాలిపోయినట్లు రైతులు తెలిపారు. బాధిత రైతులు ప్రభుత్వం, విద్యుత్ శాఖ నుంచి పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. విద్యుత్ శాఖ ఏఈని వివరణ కోరగా.. విద్యుదాఘాతంతో మంటలు వ్యాపించలేదని, విద్యుత్ తీగలు లూజుగా కిందికి ఉన్నవి వాస్తవమేనని తెలిపారు.
మహాగాంలో..
భైంసా టౌన్, ఏప్రిల్ 28 : మహాగాంలోని శంకర్‌కు చెందిన మూడెకరాలు, అప్పాల రాకేశ్‌కు చెందిన రెండెకరాలలో వేసిన మక్క పంట విద్యుదాఘాతంతో దగ్ధమైంది. వ్యవసాయాధికారి గణేశ్ బాధిత రైతుల చేను వద్దకు చేరుకొని పంట నష్టాన్ని పరిశీలించారు.
లోకేశ్వరం మండలంలో..
లోకేశ్వరం, ఏప్రిల్28 : రాయాపూర్ కాండ్లీ గ్రామంలో మంగళవారం మొక్కజొన్న దగ్ధమైంది. రైతు గజ్వరి భూమన్నకు చెందిన ఎకరం మొక్కజొన్న విద్యుదాఘాతంతో కాలిపోయింది.
మాలేగాంవ్లో..
కుభీర్, ఏప్రిల్ 28 : మాలేగాంవ్కు చెందిన బండారి భూమన్నకు చెందిన మూడెకరాల్లోని కోతవేసి కుప్పలు వేసిన మొక్కజొన్న ప్రమాదవశాత్తు కాలిబూడిదైంది. చేనులో నుంచి వెళ్లే విధ్యుత్ తీగెల్లో రాపిడి జరిగి ప్రమాదం జరిగి ఉండవచ్చని రైతు తెలిపారు. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.