శ్రీరాంపూర్, నవంబర్ 2: నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలకమని మంచిర్యాల జిల్లా డీసీపీ అఖిల్‌మహాజన్ పేర్కొన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలో ఏర్పాటు చేసిన 40 సీసీ కెమెరాల సిస్టం, కంట్రోల్ రూంను డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ నరేందర్, సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జీఎం సంజీవరెడ్డితో కలిసి ప్రారంభించారు. సీసీ కెమెరాల ద్వారా వివిధ ప్రాంతాలను వీక్షించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు సింగరేణి సహకారంతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శ్రీరాంపూర్ ఏరియా నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టిసారించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్, సీఐ బీ రాజు, ఎస్ఐ మానస, నస్పూర్ మున్సిపల్ కమిషనర్ రమేశ్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, ఎస్వోటూజీఎం త్యాగరాజు, తదితరులున్నారు.