శ్రీరాంపూర్, నవంబర్ 22 : సింగరేణి గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం నాయకులు శుక్రవారం శ్రీరాంపూర్ ఓసీపీపై కార్మికుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గోమాస ప్రకాశ్, నాయకులు సబ్‌లు ప్రేమ్‌కుమార్, మిడివెల్లి రాజ్‌కుమార్ శ్రీరాంపూర్‌తో పాటు ఓసీపీ, నస్పూర్‌లో కార్మికుల వద్ద సంతకాలు సేకరించారు. వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గనుల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని, సింగరేణి సంస్థకే గనులను అప్పగించాలని డిమాండ్ చేశారు. గనులను పెట్టుబడి దారుల చేతిలో పెట్టి సింగరేణిని నిర్వీర్యం చేయవద్దని హెచ్చరించారు. సింగరేణికే గనులు ఇచ్చే వరకూ సీపీఎం, సీఐటీయూ పోరాటాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేశ్, మోహన్ పాల్గొన్నారు.
కాసిపేట, నవంబర్ 22 : కేంద్రం అంబానీకి బీఎస్ఎన్ఎల్, అదానీకి సింగరేణి ఆస్తులు కట్టబెడుతున్నదని సీపీఎం నాయకులు ఆరోపించారు. శుక్రవారం మండలంలోని కాసిపేట 2 ఇైంక్లెన్ గ ని, కొండాపూర్ యాప, మలెపల్లి, కోమటిచేను, ముత్యంపల్లి, కాసిపేట ప్రాంతాల్లో కార్మికులు, ప్రజలు, రైతులు, మహిళలు, కూలీలతో సమావేశాలు నిర్వహించారు. సింగరేణి గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేపట్టారు. వారు మాట్లాడుతూ మోడీ కుట్రలతో తెలంగాణకు నష్టమేనని తెలిసినా కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. పోరాటాలతోనే సింగరేణిని కాపాడుకోవచ్చని తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్, నాయకులు జంగుబాయి పాల్గొన్నారు.