మంచిర్యాల అర్బన్, నవంబర్ 11 : ప్రజలకు సమస్య వస్తే వెంటనే తమను సంప్రదించాలని, పోలీసులున్నది ప్రజల రక్షణకేనని గుర్తుంచుకోవాలని సీపీ శ్రీనివాస్ అన్నారు. సోమవారం రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర షీ టీమ్ ఉమెన్ సెఫ్టీవింగ్ ఆధ్వర్యంలో పోస్టర్లను విడుదల చేశారు. సీపీ మాట్లాడుతూ ఎవరైనా ఆన్లైన్ యాప్స్, సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులు, లైంగిక వేధింపులకు గురి చేసినా, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినా వెంటనే డయల్ 100కు లేదా షీ టీమ్స్ వాట్సప్ నంబర్ 6303923700లో సంప్రదించాలన్నారు.
తల్లిదండ్రులు రోజూ పిల్లలకు కాసేపు సమయం కేటాయించాలని, వారికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, మంచిర్యాల జోన్ సిటీ ఇన్చార్జి ఎస్ఐ హైమ, మంచిర్యాల షీ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.