కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా : కుమ్రం భీం ( Kumram Bheem ) జిల్లా ఆసిఫాబాద్ మండలంలో అనుమానాస్పదస్థితిలో దంపతులు( Couple Dies ) మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. తుంపల్లి గ్రామపంచాయతీ కోసార గ్రామ పరిధిలోని భవానీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. బానోత్ రాజు ( Raju ) ,సునీత ( Sunita ) దంపతులు బుధవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందారు.
ఇద్దరు దంపతులు కొడుకు, కోడలుతో కలిసి భవానీ నగర్లో జీవనం కొనసాగిస్తున్నారు. రాత్రి భోజనం చేసిన అనంతరం భార్యాభర్తలు ఇద్దరు ఇంటి బయట వరండాలో పడుకున్నారు. రాత్రి 3 గంటల ప్రాంతంలో కరెంట్ పోవడంతో కోడలు తమ చిన్న పాపను అత్త సునీత దగ్గర పడుకోబెట్టేందుకు వచ్చి నిద్ర నుంచి లేపే ప్రయత్నం చేయగా ఆమె నుంచి స్పందన రాకపోవడంతో చూడగా అప్పటికే ఇద్దరు మృతి చెందారు.
గతంలో పీరీల విషయంలో గొడవలు జరిగాయని, తమ తల్లిదండ్రులను హత్య చేసి ఉంటారని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆసిఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.