హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, డెన్మార్క్ తదితర దేశాల్లో ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని అట్లాంటాలో యూఎస్ టీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఈ మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మెల్బోర్న్ నగరంలో నిర్వహించిన భారీ కార్ల ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా తరఫున 50 మంది పేద విద్యార్థుల ఏడాది విద్యా ఖర్చులను భరించనున్నట్టు కాసర్ల నాగేందర్ రెడ్డి ప్రకటించారు.
ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో అనిల్ బైరెడ్డి నాయకత్వంలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మెల్బోర్న్లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేటీఆర్ జన్మదిన వేడుకలను డెన్మార్‌లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకుడు శ్రీ శ్యామ్ బాబు ఆకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు, తెలంగాణ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యూకే వ్యాప్తంగా ఎన్నారై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.‘గిఫ్ట్ ఏ స్మైల్’ లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఎన్నారై బీఆర్ఎస్ లెస్టర్ ఇన్చార్జి సాకేత్రావు కాచవరపు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ బర్త్‌డే వేడుకలను బీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకుడు నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో గౌటెంగ్ (జోహన్నెస్‌బర్గ్), వెస్టర్న్కేప్ (కేప్‌టౌన్), క్వాజులు-నటాల్ (పియెటర్ మారిట్జ్ బర్గ్) రాష్ట్రాల్లో ఒకే రోజు, ఒకే సమయంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కేటీఆర్ జన్మదినాన్ని పురసరించుకుని నాయిని అనురాగ్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్-బియాండ్ బౌండరీస్’ సేవా కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు కేటీఆర్‌కు మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పోరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.