మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 22 : రౌడీలు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, లేదంటే పీడీయాక్ట్ అమలు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్లలో మార్పు తీసుకొచ్చేందుకు డీసీపీ భాస్కర్, ఏసీపీలు ప్రకాశ్, వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రతో కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ నేర ప్రవృత్తిని మార్చుకోవడానికి అవకాశమిస్తున్నామన్నారు. సన్మార్గంలో నడవాలని, కేసుల పాలుకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించాలన్నారు. హత్యా నేరాలకు పాల్పడిన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సోషల్ మీడియాపై ట్రాకింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు ప్రమోద్ రావు, అశోక్ కుమార్, నరేందర్, రవీందర్, శశిధర్ రెడ్డి, దేవయ్య, అప్జలుద్ధీన్, నరేశ్‌కుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు.
మంచిర్యాల పోలీస్ స్టేషన్ తనిఖీ…
మంచిర్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌ను రామగుండం కమిషనర్ శ్రీనివాస్ తనిఖీ మంగళవారం చేశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్ ఫైళ్లు, కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్రైనీ ఎస్ఐతో మాట్లాడారు. రికార్డులు, విధుల గురించి అధికారులను, సిబ్బందితో చర్చించారు. నేరాల నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.