సిరికొండ : గ్రామాల్లో శాంతి భద్రతలను పెంచడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలను అడ్డువేసేందుకు కార్డన్ సెర్చ్ (Cordon search) నిర్వహిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Akhil Mahajan ) తెలిపారు. సిరికొండ మండలం లోనికేశవ పట్నం లో గురువారం ఉట్నూర్ అడిషనల్ ఎస్పీ కాజల్ సింగ్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో 160 మంది పోలీసు సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులతో మాట్లాడారు.
నార్కోటిక్ డాగ్ రోమా సహాయంతో గంజాయి కోసం తనిఖీ చేశామని వివరించారు. తల్లి,దండ్రులు యువతకు చదువుకునేలా ప్రోత్సహించాలని, చదువు వలన భవిష్యత్తు, మంచి పేరు లభిస్తాయని సూచించారు. ఒకే గ్రామం నుంచి గత ఐదు సంవత్సరాలలో 90 కేసులు నమోదు అయ్యాయని, ఇక నుంచి గ్రామస్థులు సన్మార్గంలో వెళ్లాలని సూచించారు. గ్రామంలో నమోదైన రౌడీషీట్లు, సస్పెక్ట్ షీట్లను పరిశీలిస్తామని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనని వారిని పరిశీలించి రౌడీ షీట్లను, సస్పెక్ట్ షీట్లను ఎత్తివేస్తామన్నారు.
అక్రమంగా కలప రవాణాను, చెట్లను నరికి వేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. రానున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా ప్రతి ఒక్కరు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు.
ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతను తెలియజేస్తూ వాటి ఏర్పాటకు కృషి చేయాలని తెలిపారు. గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఉట్నూర్ సీఐ ఎం ప్రసాద్, ఎస్సైలు వి పురుషోత్తం, వి సాయన్న, ఎల్ శ్రీకాంత్, ఇమ్రాన్, డి రాధిక, పూజ, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అన్వర్ ఉల్ హక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.