ఆదిలాబాద్, జూన్ 19(నమస్తే తెలంగాణ) : కేసీఆర్ హయాంలో.. భారీ వర్షాలకు తట్టుకుని నిలబడిన విద్యుత్ వ్యవస్థ. బలమైన గాలులు వీచినా తెగిపడని కరెంటు లైన్లు. పెట్టని కోటలా నిటారుగా స్తంభాలు. ధ్రుడంగా ట్రాన్స్ఫార్మర్లు. లో ఓల్టేజీ, హై ఓల్టేజీ లేని కరెంటు. ఒక్కోరోజు పది సెంటీమీటర్ల వర్షం కురిసినా.. అంతరాయం లేని మెరుగైన, నాణ్యమైన సరఫరా. ఎక్కడ ఏ చిన్న అంతరాయం కలిగినా నిమిషాల్లో సరిచేసే అధికారులు. అన్ని కలగలిపి నిరంతరం కరెంటును సరఫరా చేశాడు. దండగన్న ఎవుసాన్ని పండుగలా మార్చాడు. పుట్లకొద్దీ వడ్డు పండించి, రైతుల మోముల్లో ఆనందం నింపాడు. కానీ.. ఆరున్నర నెలల కాంగ్రెస్ పాలనలో.. గాలిదుమారం లేచినా, చినుకుపడినా చిటుక్కున కరెంటు తీసేస్తున్నారు.
విద్యుత్ తీగలు తెగిపడినా, స్తంభాలు నేలకొరిగినా, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయినా, తీగలు వేలాడుతున్నా విద్యుత్ అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదు. లో ఓల్టేజీ.. లేదంటే హై ఓల్టేజీతో ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోతున్నాయి. కరెంటు అంతరాయానికి ఊళ్లకు ఊళ్లూ నాలుగైదు రోజులు గాడాంధకారంలో మగ్గుతున్నాయి. పట్టణాల్లోనే గంటల తరబడి కరెంటు తీసేస్తున్నారు. పంటలకు నీరందించేంత సేపు కరెంటు ఉండకపోవడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారు. విద్యుత్ అధికారులను నిలదీస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేస్తున్నారు. వ్యవసాయం, గృహ, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా సరిగ్గా ఉండడం లేదు. వ్యవసాయానికి అందించే త్రీఫేజ్ కరెంటు 12 నుంచి 14 గంటలు మాత్రమే ఉంటున్నది. వానకాలం ప్రారంభంకావడంతో వ్యవసాయానికి విద్యుత్ అవసరం ఉంటుంది. కరెంటు మోటార్ల ద్వారా పంటలకు నీరు అందించుకుంటారు. సీజన్ ప్రారంభం కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు ఇప్పటికే విత్తనాలు నాటారు. వర్షాలు పడకపోవడంతో స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. యాసంగింలో కరెంటు కోతల కారణంగా రైతులు పంటలను నష్టపోవాల్సి వస్తున్నది. వానకాలం విద్యుత్ సరఫరాపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
వ్యవసాయానికి కరెంటు అవసరం లేని సమయంలో రోజు 12 నుంచి 14 గంటలు మాత్రమే కరెంటు వస్తుందని, పంటలకు నీరు అవసమరమైన సమయంలో కరెంటు లేకపోతే నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేయాలని కోరుతున్నారు. చివరకు తెలంగాణ రాష్ర్టాన్ని రెప్పపాటు కరెంటుపోని రాష్ట్రంగా మార్చిన కేసీఆర్‌పై ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిందలు వేయడంపై రైతాంగం మండిపడుతున్నారు. ప్రజలు, రైతుల జీవితాల్లో వెలుగులు పంచిన నాయకుడిపై అభాండాలు మోపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనే లేకుంటే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ వచ్చినంక కేసీఆర్ మొదట రైతుల గోస తీర్చిండు. ఎవుసాన్ని పండు గలా చేసిండు. నీళ్లు, కరెంట్ సౌల తులు కల్పించి రైతుకు రంది లేకుంట చేసిండు. పదేండ్లు రైతులు మంచిగ ఎవుసం చేసుకొని లాభపడ్డరు. ఇగ గీ కాంగ్రెస్ సర్కారు వచ్చిందో లేదో.. మళ్లా తిప్పలు మొదలైనయి. కరెంట్ సక్కగా ఇవ్వక రైతులు అరిగోస పడుతున్నరు. గిట్లయితే రైతులు బతుకు డెట్లనో ఏమో.. అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇలా మోసం చేయడం సరికాదు.
-రఘోత్తమరెడ్డి, దహెగాం
దహెగాం, జూన్19 : 2014 కంటే ముందు కరెంట్ సరఫరా అధ్వానంగా ఉండే. ఎప్పుడచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెల్వకుండే.. రాత్రీ పగలూ పొలాల కాడ పడిగాపులు కాస్తుండేటోళ్లం. పంట చేతికొచ్చే వరకు నమ్మకం లేకుండే. గట్లాంటిది తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సార్ రైతులకు ఢోకా లేకుంట చేసిండు. 24 గంటల పాటు కరెంటిచ్చిండు. రంది లేకుంట రెండు పంటలు తీసేటోళ్లం. పదేండ్లు ఎవుసం మంచిగ చేసుకున్నం. ఇగ కాంగ్రెస్ వచ్చిందో లేదు.. మళ్లా గవ్వే పరిస్థితులు దాపురించినయి. ఇష్టం వచ్చినట్లు కోతలు పెడుతున్నరు. ఇదేమని కరెంటోళ్లను అడిగితే మాకేం తెలుసు పైనే కరెంట్ తీసేస్తున్నరు అని చెబుతున్నరు. గీ కాంగ్రెస్ సర్కారును నమ్మి మోసపోయినట్లయ్యింది.
-తుమ్మిడ మామన్న, దహెగాం
కోటపల్లి, జూన్ 19 : కాంగ్రెసోళ్లు ఆనాటి రోజుల తెస్తమంటే.. ఏమో అనుకున్నం. గిట్లా మళ్లా రైతులను గోస పెడుతరనుకోలె. ఎవుసానికిచ్చే కరెంట్ సరిగా ఇస్తలేరు. ఇష్టం వచ్చినట్లు కోతలు పెడుతున్నరు. 24 గంటల పాటు కరెంటిస్తున్నమమని చెబుతూనే రాత్రి పూట బంద్ చేస్తున్నరు. పగలు మాత్రమే అరకొర కరెంటిస్తే పంటలు ఎలా పండుతాయో సీఎంకే తెలియాలె. రేవంత్ సర్కారు రైతులను మోసం చేస్తున్నది.. రెప్పపాటు కరెంట్ పోకుండా కేసీఆర్ సార్ కరెంటిస్తే.. గీ కాంగ్రెసోళ్లు రైతులను అరిగోస పెడుతున్నరు. ముందే అనుకున్నం గీ కాంగ్రెసోళ్లు వస్తే మళ్లా గోసపడుడే అని. ఇప్పుడు గట్లనే అయితంది.
– రాళ్ళబండి పోచం, రైతు, కోటపల్లి
కడెం, జూన్ 19 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఇబ్బందులు ఎలా ఉండేవో అలాంటి పరిస్థితులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి మన రాష్ట్రంలోకి తీసుకొచ్చింది. 2014కు ముందు రాష్ట్రంలో వ్యవసాయం చేయడం ఎంతో ఇబ్బందిగా ఉండేది. రాత్రి సమయాల్లో మాత్రమే సాగుకు కరెంట్ ఇచ్చేవాళ్లు, కేవలం రాత్రి మాత్రమే 9 గంటల సరఫరా చేసేవారు. చేను వద్ద కునుకు తీస్తేనే మడి పారేది. చాలా మంది రైతులు పాము కాటుకు, ఇతర విష పురుగులకు బలైపోయారు. వ్యవసాయాన్ని విడిచిపెట్టే పరిస్థితులను తీసుకొచ్చింది. 2014లో ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ అధ్యక్షతన ప్రత్యేక రాష్ట్రం కోసం కరెంటు కోతలు లేని రాష్ట్రంగా మారింది. రాష్ర్టానికి అవసరమైన కరెంట్ ఉత్పత్తితోపాటు, 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించడం, పగటి పూట ఇబ్బందులు లేని కరెంట్‌ను రైతులకు నాణ్యంగా అందించారు.
ఫలితంగా వలస వెళ్లిన రైతులు తిరిగి స్వగ్రామాలకు వచ్చి వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్నారు. ఈ తరుణంలో రైతులకు పెట్టుబడుల సహాయంతోపాటు, అనేక సౌకర్యాలు కల్పించిన ఘనత కేసీఆర్‌ది. కానీ.. నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ఆరున్నర నెలల్లోనే విద్యుత్ ఇబ్బందులు తీసుకురావడంతోపాటు, రాష్ట్రంలో డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో త్రీఫేజ్ సరఫరా వేళల్లో కోతలు విధిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి సాధ్యమైన కరెంటు.. కాంగ్రెస్ సర్కారుకు ఎందుకు కావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం రైతులను ఇబ్బందులు పెట్టడమే తప్పా.. రైతుల పక్షాన ఏనాడు నిలవలేదు. పదేళ్ల కాలంపాటు రైతులను ఎలా ఆదుకోవాలని తపన పడిన కేసీఆర్‌పై, ఆయన సరఫరా చేసిన విధానంపై కాంగ్రెస్ మాట్లాడడం అర్థరహితం.
-సమ్మెట రాజన్న, రైతు, పెద్దూర్, కడెం.
భైంసా, జూన్ 19 : నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నామని చెబుతున్న కాంగ్రెసోళ్ల మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నామని వట్టి మాటలు చెబుతున్నారు. రాత్రి వేళల్లో గంటల తరబడి కరెంటు లేక ఇబ్బంది పడుతున్నాం. చిన్నపాటి వర్షం కురిసిన, గాలివీచినా కరెంటు కట్ చేస్తున్నారు. పగలు ఎండ, రాత్రి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. వర్షం సాకుతో గంటల తరబడి కరెంటు తీసేస్తున్నారు. కేసీఆర్ హయాంలో రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఉండేది. ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంటు తీసుకరావడంపై కాంగ్రెసోళ్లు దుష్ప్రచారం చేస్తున్నారు. అప్పటి పరిస్థితుల్లో రైతులను రక్షించుకోవడానికి, పరిశ్రమలను కాపాడుకోవడానికి కరెంటు కొన్నారు. లేకపోతే ఇండ్లకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి ఇబ్బంది పడేవాళ్లం.
-సాయినాథ్, రైతు, భైంసా.