కుంటాల, అక్టోబర్ 4 : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బాకీ ఉన్న విషయాన్ని తెలపాలని ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త లోలం శ్యాంసుందర్ కార్యకర్తలకు సూచించారు. సోమవారం నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరులో జరిగిన స్థానిక ఎన్నికల సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయక.. ఎన్నికల వేళ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు. కుంటాల మండలంలోని ఒక జడ్పీటీసీ, ఏడు ఎంపీటీసీ, 15 సర్పంచ్ స్థానాలకు ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పార్టీ అధిష్టానం సూచన మేరకు ఎంపికైన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని, ఎన్నికల్లో కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందని నియోజకవర్గ సమన్వయకర్త కిరణ్ కొమ్రేవార్ అన్నారు. ఎన్నికల వేళ విభేదాలు వీడి, ఐక్యంగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నియోజకవర్గ సమన్వయకర్త విలాస్ గాదేవార్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పడకంటి దత్తు, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ దశరథ్ పెంటవార్, పార్టీ మైనార్టీ కన్వీనర్ ఖదీర్, ఉపాధ్యక్షుడు దత్తు, మాజీ సర్పంచ్‌లు దాసరి కిషన్, బక్కి సునీత, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బొంతల పోశెట్టి, రజనీకాంత్, రమేశ్, నరేశ్ పాల్గొన్నారు.