మంచిర్యాల టౌన్ : కాంగ్రెస్ మోసాలకు వ్యతిరేకంగా మంచిర్యాల పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో (Joining BRS) చేరారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ( Diwakar Rao ) సమక్షంలో 55 వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ పోరెడ్డి రాజు , 49వ డివిజన్‌కు చెందిన అబ్దుల్ సత్తార్ , 13వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు లింగమూర్తి వారివారి అనుచరులతో భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు.
వీరికి మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు , రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కాంగ్రెస్‌పై ప్రజలకు విసుకు వచ్చిందని, ఇచ్చిన హామీలు మరిచి కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకొని నియంత పాలన చేస్తుందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రజలకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఆరోపించారు. పట్టణంలో కాంగ్రెస్ అగ్ర నాయకుల అనుచరులు చేస్తున్న దాడులు, బెదిరింపులు,సెటిల్మెంట్ల వలన కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని అన్నారు. స్థానిక శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావుపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, టీడీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.