మంచిర్యాల, మార్చి 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆరు గ్యారెంటీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. నిన్న(బుధవారం) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రస్తావనే కనిపించకపోవడంపై రైతులు, వృద్ధులు, మహిళలు, సబ్బండ వర్గా లు మండిపడుతున్నాయి. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్న రూ.2500పై ప్రభుత్వ పద్దులో కనీస ప్రస్తావన లేదు. ఆడవాళ్లకు అందుతున్న ఏకైక ఉచిత బస్సు రవాణాకు నిధులు తగ్గించింది. గృహజ్యోతి పథకం కింద ఇస్తున్న ఉచిత కరెంట్‌కు దాదాపు రూ.350 కోట్లకు కోత పెట్టింది. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ చాలా మందికి రావడం లే దు.
ఈ బడ్జెట్లో ఈ పథకానికి ఎక్కువ నిధులు ఇస్తారనుకుంటే గతంలో ఎంతైతే ఇచ్చారో ఇప్పుడూ అంతే ఇచ్చారు. దీంతో అన్ని రకాలుగా అర్హులై ఉండి రూ.500 గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూ స్తున్న కొత్తవారికి ఇక సబ్సిడీ సిలిండర్ ఇవ్వమని చెప్పకనే సర్కారు చెప్పింది. ఇక కాంగ్రెస్ గెలిస్తే రూ. 2వేల వస్తున్న పింఛన్ రూ.4వేలకు వస్తుందని ఆశ పడిన వృద్ధులు, ఒంటరి మహిళలు, ఇతర పింఛన్‌దారులను మరోసారి సర్కార్ మోసం చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పింఛన్‌దారులకు రూ.4 వేల చొప్పున పింఛన్ ఇవ్వాలంటే రూ.27 వేల కో ట్లు అవసరం అవుతాయి. కానీ.. రూ.13.50 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే గతంలో కేసీఆర్ సర్కారు ఇచ్చిన రూ.2 వేల పింఛన్ తప్ప పెంచింది ఏం లేదని తేలిపోయింది.
ఒక రైతు భరోసా విషయంలో కూడా మరోసారి సర్కారు మోసం చేసిం ది. ఇప్పటికే రెండు సీజన్లుగా పెట్టుబడి సాయం లేదు. ఈసారైనా బడ్జెట్లో రైతు భరోసాకు ప్రత్యేక నిధులు ఉంటాయనుకుంటే అసలు ఆ ప్రస్తావనే బడ్జెట్లో రాలేదు. దీంతో పైలెట్ గ్రామాల్లో తప్ప మిగిలిన గ్రామాల్లోని రైతులకు రైతుభరోసా రూ.12 వేలు రావడంపైన నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక రైతు రుణమాఫీ సగం మందికే ఇచ్చిన సర్కా మిగిలిన వారికి ఎగవేసినట్లేనని తేలిపోయింది. ఏ ఊరికి వెళ్లిన వంద శాతం రుణమాఫీ కాలేదు. ఈ బడ్జెట్లో కేటాయింపులు చేస్తేనైనా రుణమాఫీ అవుతుందనుకుంటే అసలు విషయాన్ని ప్రస్తావించకపోవ డం గమనార్హం.
ముందేమో రుణమాఫీకి రూ.46 వేల కోట్లు అవుతుందన్నారు. క్యాబినెట్ మీటింగ్‌లో రూ.30 వేల కోట్లు చాలు అన్నారు. గత బడ్జెట్లో రూ.26 వేల కోట్లు పెడుతున్నట్లు చెప్పారు. తీరా రూ.20 వేల కోట్లతో రుణమాఫీ చేసినట్లు నిన్న బ డ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అంటే సగానికి కంటే ఎ క్కువ మంది రైతులకు రుణమాఫీ ఇక కాదనే విష యం తేలిపోయిందని నిపుణులు అంటున్నారు. ఎ న్నికల్లో గెలిస్తే ఇస్తామన్న ఆరు గ్యారెంటీలను ఎగవే సి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై సబ్బండ వర్గాల ప్రజలు పెదవి విరుస్తున్నారు.
రుణమాఫీ ఉత్తమాటేనా?
కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులందరికీ రుణమాఫీ చేశామని చెప్పారు. అది పూర్తిగా అబద్ధం. మా ఆలూర్ గ్రామంలోనే నాతోపాటు వంద మందికి పైగా రైతులకు మాఫీ కాలేదు. ఈ బడ్జెట్లో కాని వారి కోసం కొత్తగా నిధులు కూడా కేటాయించలేదని తెలిసింది. అంటే ఈ ప్రభుత్వం మాకు మాఫీ చేయదని తేలిపోయింది. ఇది పూర్తిగా అబద్ధాల ప్రభుత్వం. మేం రైతులం కాదా? మేమేం పాపం చేసినం. మాకెందుకు మాఫీ చేయరు? నేను పీఏసీఎస్ ద్వారా రూ.1.70 లక్షల రుణం తీసుకున్న. మాఫీ లిస్టులో చివరి జాబితా వరకు చూసినం.
ఏడు నెలల కింద గతేడాది ఆగస్టులో రుణమాఫీ చేయాలంటూ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన. అన్ని అర్హతలు ఉన్నా నాకెందుకు మాఫీ కాలేదని అప్పట్లో అధికారులను నిలదీస్తే పొంతన లేకుండా మాట్లాడిన్రు. రుణమాఫీ డబ్బులు విడుదల అయ్యాయి. కానీ.. ట్రెజరీలో పెండింగ్ ఉందని అప్పట్లో అధికారులు చెప్పారు. దీంతో త్వరలోనే మాఫీ అయితుందేమోనని ఎదురుచూసిన. ఇప్పటి వరకు కాలేదు. ఈ బడ్జెట్‌తో ఆశలు ఆవిరైనయ్. నాకు గ్రామంలో తొమ్మిదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇప్పటి వరకు యాసంగికి సంబంధించి రైతు భరోసా డబ్బులు కూడా రూపాయి రాలేదు. గత వానకాలంలో సన్నరకం ధాన్యం 220 బస్తాల వరకు ప్రభుత్వానికి అమ్మిన. ఇందుకు సంబంధించి రూ.40 వేల వరకు బోనస్ డబ్బులు రావాలి. ఎప్పుడు వస్తాయో కనీసం చెప్పేవారు లేరు. రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది.
– దేశెట్టి ప్రవీణ్, రైతు, ఆలూర్, సారంగాపూర్ మండలం
రూ.2500 ఎప్పుడిస్తరు?
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఇస్తమన్నరు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటుతున్నది. ఇప్పటివరకు ఆ ఊసే లేదు. బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకానికి నయాపైసా కేటాయించలేదు. అంతేకాకుండా ఇప్పటికీ కేసీఆర్ ఇచ్చిన పింఛన్లే వస్తున్నాయి. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు చేయూత ద్వారా రూ.4 వేలు పింఛన్ ఇస్తామని చెప్పిన్రు. దీనిపై కూడా బడ్జెట్లో మాట్లాడలేదు. అంటే ఈ ప్రభుత్వానికి మహిళలపై ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నది. ఆరు గ్యారెంటీల పేరిట మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే అన్ని ఎన్నికల్లో మహిళలు తమ ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
– శిరీష, మహాలక్ష్మి పథకానికి అర్హురాలు, నిర్మల్.మండలం
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం
సిర్పూర్(యూ), మార్చి 20: కాంగ్రెసోల్లు పేద మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామంటే ఎంతో సంబురపడ్డాం. నెలకు రెండున్నర వేలు వస్తే పిల్లలను పోషించుకోవడానికి, ఇంట్ల అవసరాలకు ఉపయోగపడుతాయని మురిసి పోయిన. కానీ ఈ మాట మహిళలను ఆదుకోవడానికి కాదు.. ఆ మాటలన్నీ మా ఓట్లు లాక్కోవడానికి అని అర్థమవుతున్నది. గవర్నమెంట్లకు వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇచ్చిన మాట గుర్తుకు రావడం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.
– గేడం లక్ష్మి, గృహిణి, సిర్పూర్(యూ)
కేసీఆర్ ఇచ్చిన రూ.2016 వస్తున్నాయి..
సిర్పూర్(యూ), మార్చి 20: మా అమ్మకు వయస్సు అయిపోయింది. ఇంట్లోనే ఉంటుంది. ప్రతి నెల ఆమెకు దవాఖాన ఖర్చులు, మందుల ఖర్చులవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ముసలోళ్లకు రూ.4000 పింఛన్ ఇస్తాం అని అంటే అందరం నమ్మినం. పింఛన్ పెంచితే మా అమ్మ ఖర్చులకు ఎంతో ఉపయోగపడతాయి అనుకున్న. గవర్నమెంట్ ఏర్పాటు చేసి ఏడాదిన్నర అవుతున్నది. ఇప్పటికీ పింఛన్ పెంచలేదు. కేసీఆర్ ఇచ్చిన రూ.2016 మాత్రమే ఇస్తున్నరు. ఈ బడ్జెట్‌తో కాంగ్రెస్ పింఛన్ పెంచదు.. వాళ్లు మాకు ఇవ్వరని అర్థమైంది.
-పుర్క సురేశ్, సిర్పూర్(యూ)
రూ.2 లక్షల రుణమాఫీ కాలే..
నాకు రూ.2 లక్షల చిల్లర పంట రుణం ఉంది. గతంలో అందరికీ మాఫీ చేసినోళ్లు నాకు చేయలేదు. ఈసారి బడ్జెట్లో నిధులు ఇచ్చి నా మాదిరిగా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తారు అనుకున్నా. కానీ.. అసలు డబ్బులే ఇవ్వలేదని అంటున్నారు. ఇక నాకు రుణమాఫీ కాదని తేలిపోయింది. కాంగ్రెసొస్తే రూ.2 లక్షలు మాఫీ అవుతుంది అనుకున్నా. దానికి సవాలక్ష కొర్రీలు పెట్టి అసలు మాఫీ చేయకుండా వదిలేస్తారనుకో లేదు.
– అన్నమనేని సుధాకర్‌రావు, తాండూర్
రూ.4 వేల పింఛన్ వచ్చేట్టు లేదు..
ప్రస్తుతం నాకు రూ.2వేల పింఛన్ వస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే రూ.4వేలు ఇస్తామన్నరు. మళ్ల నిన్న, ఇవాళ అసలు మాకు నిధులేవో ఇయ్యలేదని బయట చెప్తున్నరు. ఇక రూ.2వేల పింఛనే ఇస్తరా? ముందు చెప్పినట్లు రూ.4వేల పింఛన్ రాదా? అనేది అర్థం కావడం లేదు. రూ.4 వేల పింఛన్ వస్తే ఖర్చులకు కొన్ని ఉంచుకుని, మిగిలిన పైసలతో ఆసుపత్రికి పోదామని ఆశగా చూస్తున్నా. ఇస్తరో ఇయ్యరో తెలుస్తలేదు. ఎన్నికల ముందు చెప్పినట్లు పింఛన్ రూ.4వేలు ఇస్తే బాగుంటది.
– ఇందారపు భీమయ్య, తాండూర్
అటకెక్కించారు..
ఆరు గ్యారెంటీల అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడాన్ని అటకెక్కించింది. మహిళలకు రూ.2500, తులం బంగారం, ఆసరా పింఛన్ దారులకు 4 వేల పింఛన్, నిరుద్యోగ భృతి పథకాలకు నిధులు కేటాయించలేదు. అంటే ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత బడ్జెట్ రైతులు, పేదలు, మహిళలకు ప్రయోజనం చేకూర్చేలా లేదు. నిధుల కేటాయింపులో చిన్నచూపు చూసి ప్రతి రంగాన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది.
– రాళ్లబండి పోచం, కోటపల్లి