మంచిర్యాల టౌన్/తాండూర్/నెన్నెల/జన్నారం/ చెన్నూర్ రూరల్/మందమర్రి/కోటపల్లి/రామకృ ష్ణాపూర్/దండేపల్లి, జూలై 5 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు రాగా, భయపడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికక్కడ గులాబీ శ్రేణులను అడ్డుకొని, అరెస్టులు చేయించి నిర్బంధంగా పోలీస్స్టేషన్లకు తరలించింది. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావును ఇంట్లో నుంచి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దివాకర్‌రావు ఒక్కరే వెళ్లాలని కండిషన్ పెట్టారు. దీంతో చేసేదేమీ లేక దివాకర్‌రావు తన వాహనంలోనే ఇతర నాయకులను వెంట తీసుకొని కన్నెపల్లికి బయలుదేరి వెళ్లారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె భూమేశ్, బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు గాదే సత్యంను గృహ నిర్భంధం చేశారు.
యూత్‌విభాగం పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి పడాల రవీందర్, అంకుష్, కరుణాకర్‌ను అరెస్టు చేశారు. మంచిర్యాలలోని ఓవర్‌బ్రిడ్జి వద్ద సీఐ ప్రమోద్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో గుమిగూడి వాహనాలు తనిఖీ చేశారు. ఇక తాండూర్ మండలం నుంచి బయలుదేరిన బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడ సతీశ్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు క్రాంతికుమార్, పలువురు శ్రేణులను అక్రమంగా ముందస్తుగా అరెస్టులు చేసి మాదారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నెన్నెలలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంజాల సాగర్గౌడ్ను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి, స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఆదివారం తెల్లవారుజామున సాగర్ ఇంటికి పోలీసులు వెళ్లి నిర్భందించారు. ఆయన ఎటూ వెళ్లకుండా స్టేషన్‌కు తరలించారు. సర్పంచ్‌లు,మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. జన్నారంలో మాజీ వైస్ ఎంపీపీ సుతారి వినయ్, మాజీ సర్పంచ్ జాడి గంగాధర్, వోలాల నర్సగైడ్,చెట్పెల్లి సత్యం, సాయి, బందేల్ల ప్రేమ్‌ను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మందమర్రి పట్టణానికి చెందిన బీఆర్ఎస్, టీబీజీకేఎస్ సీనియర్ నాయకులు మేడిపల్లి సంపత్, కొంగల తిరుపతి రెడ్డి, ఎండీ అబ్బాస్, పల్లె నర్సింగ్, కనకం రవీందర్, సీపెల్లి రాజలింగు, దాసరి రాజనర్సు, ఏల్పుల కిరణ్, మొగురం శ్రీనివాస్, కోడెం శ్రీనివాస్, అఖిలేశ్ పాండే, వెంకటేశ్వర్లను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకూ పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచుకొని, ఆపై సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. కోటపల్లి మండల రాంపూర్ గ్రామంలోని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్ ఇంటికి వెళ్లి ముందస్తు అరెస్ట్ చేసి కోటపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎరినాగుల ఓదెలు, నాయకులు మానిశెట్టి మల్లయ్య, సీనియర్ నాయకులు రాళ్ళబండి శ్యాంసుందర్, కోటపల్లి మండల సోషల్ మీడియా నాయకులు బాపు నాయక్, రాజ్‌కుమార్, కొట్టె సాయిలను ముందస్తుగా అరెస్ట్ చేసి కోటపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్ మాట్లాడుతూ కేసీఆర్‌పై కక్షతోనే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం గోసపెడుతుందని పేర్కొన్నారు. కన్నెపల్లి గేట్లు ఎత్తితే పంటలకు నీళ్లు వస్తాయని, పంటలు పండితే రైతులకు యూరియా ఇవ్వాలని, కరెంట్ ఇవ్వాలని, పంటలకు మద్దతు ధర ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌నే ఎండబెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. రామకృష్ణాపూర్లో నాయకులు డాక్టర్ రాజా రమేశ్, కంభగోని సుదర్శన్‌గౌడ్, వంశీకృష్ణ, ఖలీం, రామిడి లక్ష్మీకాంత్, కరుణాకర్, శివ, మణి కుమార్, అవినాశ్‌లను అరెస్టు చేశారు. దండేపల్లి మండల బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దండేపల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అక్కల రవీందర్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్‌లను పోలీసులు అరెస్టు చేశారు.