మంచిర్యాల, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘చెట్టంటే.. సమస్త జీవరాశికి ‘ఆయువు’పట్టు.. ఆకై, కాయై, పండై ఆకలి తీర్చే కల్ప‘తరువు’.. కలకాలం చల్లని నీడై, తోడై, ప్రాణవాయువై కాపాడే వృక్షం.. వాతావరణ సమతౌల్యతను కాపాడే కాలుష్య నియంత్రిక.. అలాంటి చెట్టును రక్షించేందుకు కేసీఆర్ సర్కారు ‘హరితహారం’ ఉద్యమంలా చేపట్టగా, జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలందుకున్నది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్యక్రమంగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. అంతటి సత్ఫలితాలిచ్చిన కార్యక్రమం నేడు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో ప్రమాదంలో పడింది. నాడు.. పచ్చగా కళకళలాడిన ఊర్లు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, అర్బన్ పార్క్‌లు, ఏకో పార్కులు, ఎవెన్యూ ప్లాంటేషన్లు నేడు.. ఆనవాళ్లు కోల్పోయి అధ్వానంగా మారాయి. మొక్కలు, చెట్లన్నీ ఎండిపోయి ఎడారులను తలపిస్తున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతున్నా పట్టించుకునే నాథుడే కరువవ్వడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ పచ్చబడాలే.. చెట్లు లేక బోసిపోయిన పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం వెల్లివిరియాలే.. పరాయి పాలనలో నిర్జీవంగా మారిన అడవులకు పునరుజ్జీవం పోయాలే.. పర్యావరణ పరిరక్షణలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలే..’ అనే సదుద్దేశంతో కేసీఆర్ సర్కారు హరితహారం కార్యక్రమం చేపట్టి కోట్లాది మొక్కలకు ప్రాణం పోసింది. వేల కోట్లు ఖర్చు పెట్టి పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృ తి వనాలు, అర్బన్ పార్క్‌లు, ఏకో పార్కులు, ఎవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనం ఉట్టి పడేలా చర్యలు తీసుకున్నది. ఫలితంగా తెలంగాణలో అడవుల శాతం పెరిగింది. ఇంకో రెం డు, మూడేళ్లు నాటిన మొక్కలను కాపాడుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయనుకుంటున్న సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హరితహారాన్ని నిర్లక్ష్యం చే స్తున్నది. అసలు ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో పచ్చదనం అనేది కనిపించకపోవడం గమనార్హం. కేసీఆర్ పాలనలో ఎక్కడ చూసినా కళకళలాడిన మొక్కలు నేడు ఎండిపోయి కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. పట్టించుకోవాల్సిన అ ధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, మున్సిపాలిటీ, ఫారెస్టు శాఖలు ఇ ప్పుడు అసలు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. కొ త్తవి పెట్టకపోగా.. ఉన్నవాటిని కూడా కాపాడుకునే ప్రయ త్నం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హరితహారం అస్తవ్యస్తం
ఆదిలాబాద్, మే 16 ( నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన హరితహారం పథకం సత్ఫలితాలనిచ్చింది. ఈ పథకం పకడ్బందీగా అమలు చేయడంతో ఆదిలాబాద్ జిల్లాలో 7 శాతం పచ్చదనం పెరిగింది. అడవుల జిల్లా ఆదిలాబాద్‌ను ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు నిరక్ష్యం చేయడంతో పలు ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం తగ్గింది. బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది మొక్కలు నాటడంతో అటవీ విస్తీర్ణం సైతం పెరిగింది. రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, చెరువు, పొలం గట్లు, ఇండ్లు, పలు చోట్ల మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేసింది. హరితవనాలు, పల్లె, పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలు నాటారు. ఎనిమిది విడుతలుగా సాగిన హరితహారంలో జిల్లా వ్యాప్తంగా 5 కోట్ల వరకు మొక్కలు నాటారు.
ఎండిపోతున్న మొక్కలు
కోట్లాది రూపాయల ఖర్చుతో నాటిన హరితహారం మొక్కల సంరక్షణ కాంగ్రెస్ పాలనలో కరువైంది. నాటిన మొక్కలకు ఎండాకాలంలో నీరు పోయకపోవడం, పశువులు తినకుండా సంరక్షణ చర్యలు చేపట్టక పోవడం, కొన్నింటిని నరికి వేయడంతో హరితహారం పథకం అస్తవ్యస్తంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో పకడ్బందీ ప్రణాళికలతో చేపట్టిన హరితహారం పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిర్మల్ జిల్లాలో..
బీఆర్ఎస్ సర్కారు నిర్మల్ జిల్లాలో 2015 సంవత్సరం నుంచి 2023 వరకు 2 కోట్ల 66 లక్షల 37 వేల 330 మొక్కలు నాటింది. 2.55 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, అంతకు మంచి మొక్కలు నాటి సంరక్షించింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పట్టింపులేని తనంతో ఎక్కడికక్కడ మొక్కలు ఎండిపోతున్నాయి. పల్లె ప్రకత్రి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, అర్బన్ పార్క్‌లు, ఏకో పార్కులు ఎండిపోయి కళావిహీనంగా మారాయి.