ఆదిలాబాద్, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ మున్సిపాలిటీకి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పలు కాలనీల్లో అభివృద్ధి పనులకు ఆటంకం కలిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న ఆదిలాబాద్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ప్రగతిపథంలోకి పయనింప చేసింది. రూ.300 కోట్లతో మున్సిపాలిటీ అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేసింది. ఎస్డీఎఫ్, సీఎం అస్సూరెన్స్, టీయూఎఫ్ఐడీసీ, ఆర్అండ్బీ నిధులతో ఆదిలాబాద్ పట్టణాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీల్లో రోడ్లు, మురికికాల్వల నిర్మాణం, తాగునీటి సౌకర్యంలో భాగంగా మిషన్ భగరీథ పథకంలో భాగంగా ఇంటింటికీ నల్లానీటి సౌకర్యం కల్పించారు. వార్డుల్లో పార్కుల ఏర్పాటు, హరితహారంలో భాగంగా మొక్కల పెంపకం చేపట్టారు. పట్టణంలోని రూ.50 కోట్లతో అన్ని చౌరస్తాలను అభివృద్ధి చేయడంతో కనువిందు చేస్తున్నాయి.
రూ.41.30 కోట్ల నిధుల నిలిపివేత
బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల అభివృద్ధి కోసం గతేడాది రూ.46.70 కోట్లను మంజూరు చేసింది. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీయూఎఫ్ఐడీసీ) నుంచి ఈ నిధులను రుణంగా ఇస్తున్నట్లు గతేడాది సెప్టెంబరు 22న జీవో ఆర్టీ నం.719 ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులతో కాలనీల్లో మురికికాలువలు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, కల్వర్టులు, వంతెనల నిర్మాణాలకు సంబంధించిన 49 పనులు చేయాల్సి ఉండగా, అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పనులు ప్రారంభంకాలేదు. ఎన్నికల తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిధులను నిలిపివేసింది. కౌన్సిలర్లు ఆందోళన నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం కలెక్టర్ అధ్యక్షతన, ఎమ్మెల్యే, మున్సిపల్, ఆర్అండ్బీ ఇంజినీర్లు ఆధ్వర్యంలో ప్రతిపాదనలు సవరించి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు సవరించి ప్రభుత్వానికి పంపగా వీటిలో కేవలం రూ.5.40 కోట్లకు సంబంధించిన పనులను మాత్రమే ప్రభుత్వం ఆమోదించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో పలు కాలనీల్లో అభివృద్ధి పనులు నిలిచిపోగా, వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మున్సిపాలిటీకి అన్యాయం జరిగింది..
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో తీవ్ర అన్యాయం జరిగింది. కేఈర్కే కాలనీ, బంగారుగూడ, 170 కాలనీ, న్యూ హౌసింగ్ బోర్డు బల్దియాలో వీలినమైన 13 వార్డుల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. పలు వార్డుల ప్రజలు రోడ్లు, మురికికాలువలు, కల్వర్టులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వానకాలంలో వర్షం నీరు ఇండ్లలోకి ప్రవహిస్తుంది. ప్రభుత్వ సూచనల మేరకు సవరించిన ప్రతిపాదనలు ఆమోదించకపోవడం విచారకరం. – జోగు ప్రేమేందర్, చైర్మన్, ఆదిలాబాద్ మున్సిపాలిటీ.
చిత్రంలో కనిపిస్తున్నది ఆరో వార్డులోని కుంట నీరు. యేటా వానకాలంలో వర్షాలతో కుంటలోని నీరు సమీప గృహాల మధ్య నుంచి ప్రవహిస్తుంది. ఇక్కడ కల్వర్టు నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.