నిర్మల్, నవంబర్ 3(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది. ప్రైవేటు కాలేజీల్లో చదివే ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంటును చెల్లిస్తేనే వారి చదువులు నిరాటంకంగా కొనసాగే అవకాశం ఉంది. కానీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్‌మెంటు బిల్లులను విడుదల చేయడం లేదు. దీంతో ఆయా కళాశాలల యాజమాన్యాలు విద్యా సంస్థలను నడుపలేని పరిస్థితి నెలకొన్నది.
రాష్ట్రంలోని ఫీజు రీయింబర్స్మెంట్ పరిధిలోకి వచ్చే అన్ని కళాశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో గత మూడు నెలల క్రితం పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. నిధులు విడుదల చేయని కారణంగా కళాశాలల నిర్వహణ భారంగా మారుతున్నదని, ఇప్పటికే కొన్ని కళాశాలలు మూతబడ్డాయని అధికారులు, మంత్రులకు వినతి పత్రాలు అందజేశారు. ముఖ్యంగా డిగ్రీ కళాశాలలు పూర్తిగా రీయింబర్స్మెంటుపైనే ఆధారపడి కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దీంతో స్పందించిన ప్రభుత్వం రెండు విడుతల్లో నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది.
దసరాకు ఒకసారి, దీపావళికి మరోసారి బకాయిలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వాధినేతలు.. తాత్కాలికంగా కాలేజీల యాజమాన్యాలను శాంతింపజేశారు. అయితే ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఇప్పటివరకు నయాపైసా విడుదల చేయకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు మళ్లీ ఆందోళనబాట పట్టాయి. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు కాలేజీల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లాలో కూడా కాలేజీలను బంద్ చేశారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 26 డిగ్రీ కాలేజీలు ఉండగా, ఆయా కళాశాలలకు దాదాపు రూ.76 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. బకాయిలు చెల్లించే వరకు కళాశాలను తెరవబోమని యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించని కారణంగా నిర్మల్ జిల్లాలోని దాదాపు 50 వేల మంది విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొన్నది.
కాలేజీలను నడుపలేక పోతున్నం..
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఏళ్ల తరబడి చెల్లించలేక పోవడంతో కాలేజీలను నడపడం భారంగా మారుతున్నది. కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులు, సిబ్బందికి నెలనెలా జీతాలు చెల్లించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవి కాకుండా భవనాల అద్దె, కరెంటు బిల్లులు, ఇతర ఖర్చుల కోసం యాజమాన్యాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 80 శాతానికి పైగా విద్యార్థుల అడ్మిషన్లు పూర్తిగా ప్రభుత్వం చెల్లించే ఫీజు రీయింబర్స్మెంట్ ఆధారంగానే జరుగుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పెండింగ్ బకాయిలు విడుదల చేసి విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా చూడాలి.
– వెంకట్‌రెడ్డి, టీపీడీఎంఏ(తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్
మేనేజ్మెంట్ అసోసియేషన్) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
బిల్లులు చెల్లించే వరకు తెరవం..
నిర్మల్ జిల్లాలో 26 కాలేజీలకు సంబంధించి దాదాపు రూ.76 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. వాటిని చెల్లించే వరకు కళాశాలలు తెరిచేది లేదు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. గతంలో యాజమాన్యాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. బిల్లుల విడుదలపై ప్రభుత్వం మాట తప్పింది. విద్యా వ్యవస్థపై ప్రభుత్వానికి పట్టింపు లేని కారణంగా విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి ప్రైవేటు కాలేజీలను ఆదుకోవాలి.
– నరేశ్‌గౌడ్, టీపీడీఎంఏ నిర్మల్ జిల్లా అధ్యక్షులు.