మంచిర్యాలటౌన్, అక్టోబర్ 13 : మంచిర్యాల లారీ అసోసియేషన్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. పాత కమిటీ సభ్యులు అసోసియేషన్‌కు సంబంధించిన లెక్కలను సరిగా చెప్పకముందే ఉన్నట్లుండి ఎన్నికలకు పోవ డమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అందులోనూ అసోసియేషన్ బైలాస్ పాటించకుండా ఒక వర్గానికి చెందిన సభ్యులు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అసోసియేషన్ డబ్బులు వాడుకున్న వారిపై కమిటీ పనిష్మెంట్ ఇచ్చి ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయవద్దంటూ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా గతం లో తప్పులు చేసిన వారిని పోటీలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అదీగాక ఉన్నట్టుండి ఎన్నికలను నిర్వహించడం వెనక మతలబు ఏమిటన్నది అర్థంకావడం లేదని పలువురు సభ్యులు అంటున్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న డ్రైవర్లు, క్లీనర్లు లారీలపై సరుకులు తీసుకొని దూరప్రాంతాలకు వెళ్తే వారు ఓట్లు వేయకుం డా ఉంటారని చెబుతున్నారు. లెక్కల విషయంలో సభ్యుల మధ్య గొడవలు తారా స్థాయికి చేరి ఘర్షణకు దారితీసి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యం లో ఎన్నికలను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారంటూ పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.