ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, మార్చి 6 : నర్సరీల్లోని ప్రతి మొకనూ సంరక్షించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్ జీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని ఆకస్మికంగా సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ మొకల పెంపకంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మొకలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీటిని అందించాలని తెలిపారు. నర్సరీ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన గ్రామపంచాయతీ కార్యదర్శి కవితకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
వేసవి దృష్ట్యా పని ప్రదేశాల్లో ఉపాధి హామీ కూలీల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ మండలం ఎల్లారం శివారులోని వ్యవసాయ చేనులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పనులు చేపట్టే ప్రాంతాల్లో తాగునీరు, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందించాలని, ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని నీడ కల్పించాలన్నారు. అనంతరం ఉపాధి కూలీలతో మాట్లాడారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బానోత్ దత్తారాం, ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
బాలికలు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని పట్టుదలతో సాధించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ మండలం బాబాపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో జిల్లా మహిళా, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన భేటీ బచావో- భేటీ పడావో దశాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికలను బతికించుకుందామని, వారిని ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రోత్సహిద్దామన్నారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాసర్, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త శారద, మాస్టర్ ట్రైనర్లు రాజేశ్, సుందిళ్ల రమేశ్, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.