ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జూన్ 1: విత్తనాలను అధిక ధరకు విక్రయిస్తే కఠిన చ ర్యలు తప్పవని డీలర్లను కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే హెచ్చరించారు. శనివారం ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామంలోని అను బ్రదర్స్ సీ డ్స్, ఫర్టిలైజర్ షాపును కలెక్టర్, అధికారులతో కలిసి తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువుల గోదామును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కంపెనీ నిర్ణయించిన ధరలకే విత్తనాలు, ఎరువులను విక్రయించాలని డీలర్‌కి సూచించారు.
డీలర్ లైసెన్స్, దుకాణం అనుమతి వివరాలు, స్టాకు నిలువ, ధరల పట్టికను షాపు ముందు బోర్డుపై ఉంచాలన్నారు. స్టాకు నిలువ రిజిష్టర్‌ను, విక్రయించిన స్టాకు వివరాలను ప్రతి రోజూ ఆన్లైన్లో పొందుపర్చాలని తెలిపారు. విత్తనాలను విడిగా విక్రయించవద్దని తెలిపారు. విత్తనాలు ప్యాకెట్ల కవర్లు, రసీదులను భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ దేశ్ పాండే శ్రీనివాస్, ఏవో ఖాదర్ హుస్సేన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా అన్ని పనులు పూర్తయిన పాఠశాలల్లో డ్యూయల్ డెస్ బెంచీలు, గ్రీన్ చాక్ బోర్డులు అందజేస్తామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. చిర్రకుంటలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రధానమైన పనులు పూర్తవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల పైకప్పు లీకేజీలను అరికట్టేందుకు రూఫ్ మెంబ్రెన్స్ షీట్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని సంబంధిత అసిస్టెంట్ ఇంజినీర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారి భరత్ కుమార్, తహసీల్దార్ దేశ్‌పాండే శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారి మను కుమార్, పాఠశాల హెచ్ఎం, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.