ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, మే 12 : ఈ నెల 13న 001-సిర్పూర్, 005-ఆసిఫాబాద్ (ఎస్టీ) అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆన్లైన్లో నమోదు చేసే కంప్యూటర్ ఆపరేటర్లు, అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి 2 గంటలకోసారి నమోదైన ఓట్ల వివరాలు సేకరించాలని, నియోజకవర్గానికి ఒక జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పోలింగ్ రోజు ఉదయం 9 గంటలకు, 11 గంటలకు, మధ్యాహ్నం ఒంటి గంటకు, 3 గంటలకు, 4 గంటలకు వివరాలు సేకరించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఇన్చార్జిలుగా వ్యవహరించే జిల్లా స్థాయి అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య అధికారి అనిల్‌కుమార్, జిల్లా ఆడిట్ అధికారి, ఎన్నికల విభాగం తహసీల్దార్ మధుకర్, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌతమ్ రాజ్, నాయబ్ తహసీల్దార్ జితేందర్, ఎన్ఐసీ. ఇన్చార్జి శ్రీకాంత్, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.