ఆదిలాబాద్ : రైతులు పంటల సాగులో భాగంగా ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని, మోతాదుకు మించి వాడకూడదు అని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో మండలంలోని సిరిసన్న గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయన, పురుగు మందులను విచక్షణ రహితంగా వాడకూడదన్నారు.
నీటిని ఆదా చేసుకోవడంతో పాటు పంట వైవిధ్యాన్ని పాటించాలని, నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలని, విత్తన రసీదులను భద్రపరచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. రైతులు పంటల సాగులో భాగంగా సమస్యలు వచ్చినప్పుడు వ్యవసపాయ శాఖఅధికారులతో పాటు శాస్త్రవేత్తలను సంప్రదించి వారి సలహాలు సూచనలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ప్రవీణ్ కుమార్, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహన్, కె.వికే శాస్త్రవేత్తలు డాక్టర్ కే రాజశేఖర్, డాక్టర్ డి మోహన్ దాస్ పాల్ పాల్గొన్నారు.